Operation Spiderweb: 18 నెలల ప్లానింగ్‌.. సినిమా స్టైల్లో స్కెచ్‌..! రష్యాను దెబ్బతీసిన ఉక్రెయిన్‌

ఉక్రెయిన్ రష్యాపై అద్భుతమైన డ్రోన్ దాడిని నిర్వహించింది. FSB కార్యాలయం సమీపంలోనే నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని, 117 ఆత్మాహుతి డ్రోన్లను రష్యా లోని 5 వైమానిక స్థావరాలపై దాడి చేసింది. 41 రష్యన్ బాంబర్లు, A-50 ఎయిర్‌క్రాఫ్ట్ లు ధ్వంసమయ్యాయి.

Operation Spiderweb: 18 నెలల ప్లానింగ్‌.. సినిమా స్టైల్లో స్కెచ్‌..! రష్యాను దెబ్బతీసిన ఉక్రెయిన్‌
Ukraine Drone Strikes On Ru

Updated on: Jun 03, 2025 | 10:26 AM

శత్రు దేశం నట్టింట్లో తిష్ట వేసి, వాళ్ల వేలితో వాళ్ల కన్నే పొడిస్తే ఆ కిక్కే వేరప్పా! వాళ్ల ఇంటెలిజెన్స్‌ ఆఫీస్‌ పక్కనే దుకాణం తెరిచి, వాళ్లపైనే దాడి చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉక్రెయిన్‌ అదే పని చేసింది. సినిమా కథలా కనిపించే రియల్‌ వార్‌ స్టోరీ ఇది. చర్చలు అంటూనే యుద్ధం చేస్తున్నాయి ఉక్రెయిన్‌, రష్యా. పైకి శాంతి మంత్రం, లోన యుద్ధ తంత్రం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌ నిర్వహించిన ఆపరేషన్‌ స్పైడర్‌ వెబ్‌రష్యా వ్యూహాత్మక బాంబర్ల దళాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. రష్యా నట్టింట ఉక్రెయిన్‌ గూఢచారులు కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకుని.. ఆ దేశపు బాంబర్‌ విమానాలను పేల్చేశారు. ఈ ఆపరేషన్‌ను సమన్వయం చేసుకోవడానికి ఏకంగా రష్యా ఇంటెలిజెన్స్‌ సంస్థ FSB కార్యాలయం పక్కనే కో ఆర్డినేషన్‌ సెంటర్‌ను ఉక్రెయిన్‌ నిర్వహించింది.

ఆపరేషన్‌లో భాగంగా 117 ఫస్ట్‌పర్సన్‌ వ్యూ ఆత్మాహుతి డ్రోన్లను రష్యాలోకి ఉక్రెయిన్‌ స్మగ్లింగ్‌ చేసింది. చెక్కతో చేసిన క్యాబిన్లలో డ్రోన్లను పెట్టి, వాటిని ట్రక్కుల్లో ఉంచి స్థానిక డ్రైవర్ల ద్వారా రష్యాలోని ఒలెన్యా, బెలాయా సహా 5 వైమానిక స్థావరాల దగ్గరకు చేర్చింది. ఆ తర్వాత లారీల్లోని చెక్క క్యాబిన్ల డోర్లను రిమోట్‌ సాయంతో తెరిచింది. ఆ తర్వాత ఆత్మాహుతి డ్రోన్లు ఒక్కోటీ గాల్లోకి ఎగిరి రష్యా వ్యూహాత్మక న్యూక్లియర్‌ బాంబర్లపై విరుచుకుపడ్డాయి. ఈ ఆపరేషన్‌లో 41 TU-95, TU-22ఎం3 బాంబర్లు, కీలకమైన A-50 ఎయిర్‌ క్రాఫ్ట్‌లు ధ్వంసమయ్యాయి. 18 నెలల ప్లానింగ్‌తో, పక్కా స్కెచ్‌తో ఉక్రెయిన్‌ ఈ దాడి చేసింది. ఈ ఆపరేషన్‌కు సహకరించిన వారిని ముందే రష్యా నుంచి సురక్షితంగా బయటకు తెచ్చేసినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు.

ఉక్రెయిన్‌లో మోహరించిన అమెరికా మిస్సైళ్ల నుంచి తప్పించుకునేందుకు, సరిహద్దు నుంచి దాదాపు 4 వేల కిలోమీటర్ల దూరంలో, తమ బాంబర్లను భద్రపరిచింది రష్యా. కానీ ఉక్రెయిన్‌ స్పెషల్‌ సర్వీసు దళాలు ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి.. ఎఫ్‌పీవీ డ్రోన్లతో 41 విమానాలను ధ్వంసం చేశాయి. ఈ దాడిలో మాస్కోకు కనీసం 1.5 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లి ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ దాడికి ప్రతీకారంగా ఉక్రెయిన్‌ సైనిక శిక్షణ స్థావరంపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 12 మంది సైనికులు మృతి చెందారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..