No Mask Rule: ఆ దేశంలో సీన్ రివర్సయ్యింది.. మాస్కు ధరిస్తే ఫైన్ విధిస్తున్నారు..!

|

Jun 07, 2021 | 5:56 PM

ఏడాదిన్నర కాలంగా మాస్కు ధరించండి బాబో.. అన్న సూచనలు, ఆదేశాలు.. ఇంకాస్త ముందుకేసి.. మాస్కు ధరించకపోతే ఫైన్లేస్తామన్న బెదిరింపులే వింటూ వున్నాం.. కానీ తాజాగా అగ్రరాజ్యం...

No Mask Rule: ఆ దేశంలో సీన్ రివర్సయ్యింది.. మాస్కు ధరిస్తే ఫైన్ విధిస్తున్నారు..!
Biden
Follow us on

No Mask Rule in United States of America: ఏడాదిన్నర కాలంగా మాస్కు ధరించండి బాబో.. అన్న సూచనలు, ఆదేశాలు.. ఇంకాస్త ముందుకేసి.. మాస్కు ధరించకపోతే ఫైన్లేస్తామన్న బెదిరింపులే వింటూ వున్నాం.. కానీ తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో మాస్కు ధరిస్తే ఫైన్లేస్తామంటున్నాయి రెస్టారెంట్లు.. బిల్లులో అధికంగా చెల్లించాల్సి వుంటుందని బోర్డులు కూడా పెట్టేస్తున్నాయి. ఎస్.. అమెరికాలో ఇపుడిది ట్రెండ్ మారింది.

కరోనా వైరస్ విజ‌ృంభించిన వెంటనే మాస్కు రూల్ ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మన దేశంలో అయితే మాస్కు ధరించకపోతే ఏకంగా ఫైన్లు వేస్తున్న పరిస్థితి. ప్రజలంతా మాస్కులు ధరించాలంటూ వివిధ దేశాల ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. ఒకరకంగా చెప్పాలంటే 2020ని మాస్కు నామ సంవత్సరంగాను, కరోనా నామ సంవత్సరంగాను పిలుచుకోవాలన్నంతగా ప్రచారం జరిగింది.

తాజాగా అమెరికాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గిపోవడంతో నో మాస్కు రూల్ అమల్లోకి వచ్చేసింది. ప్రెసిడెంట్ బైడెన్ స్వయంగా ప్రజలిక మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ తుది దశకు చేరుకోవడంతో బైడెన్ నో మాస్కు ప్రకటన చేశారు. ఈ క్రమంలో కాలిఫోర్నియాలోని ఫిడిల్ హెడ్ రెస్టారెంట్ సర్‌ప్రైజింగ్ రూల్ అమల్లోకి తెచ్చింది. తమ రెస్టారెంట్లోకి ఎవరైనా మాస్కు ధరించి వస్తే బిల్లుపై అదనంగా 5 డాలర్లు చెల్లించాల్సి వుంటుందని బోర్డు పెట్టిందా రెస్టారెంట్ యాజమాన్యం. అయితే.. రెస్టారెంట్ ఆదేశాలను చూస్తున్న కస్టమర్లు అయిదు డాలర్లు పోతే పోయాయి.. గానీ మాస్కు తీయబోమంటూ ట్విస్టునిస్తున్నారు.

నో మాస్కు పిలుపును అమెరికన్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే గత సంవత్సరం మిగిల్చిన చేదు అనుభవం వారిని ఇప్పుడపుడే కరోనా భయం నుంచి బయట పడనివ్వడం లేదు. దాంతో 5 డాలర్లు కట్టేందుకు కూడా రెడీ అవుతున్నారు. దాంతో ఫిడిల్ హెడ్ కేఫ్ రెస్టారెంటుకు బాగానే డబ్బులు వసూలవుతున్నాయి. ఈ అదనపు మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నట్లు రెస్టారెంటు యజమాని క్రిస్ కాస్టిల్ మ్యాన్ వెల్లడించారు. అదనపు మొత్తం వసూలు చేయాలన్న నిర్ణయాన్ని తాను సమర్థించుకున్నాడు క్రిస్.