భారత్- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను మరింత బలోపేతంగా చేయడం లక్ష్యంగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ .. జర్మనీ వేదికగా కొనసాగుతోంది.. స్టుట్‌గాట్ లోని MHP ఎరినా ఫుట్‌బాల్ స్టేడియం వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు శుక్రవారం ప్రారంభమైంది.. టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్‌దాస్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి 200 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. సమ్మిట్ రెండో రోజు గ్రీన్ ఎనర్జీ విభాగంలో పనిచేస్తున్న ఏఎం గ్రీన్ కంపెనీ వైస్ చైర్మన్ బి.సి. త్రిపాఠి పాల్గొని మాట్లాడారు.. ఈ సమయంలో ప్రపంచం తన శక్తి అవసరాలను వేగంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే వాతావరణ మార్పులను ఎదుర్కోవడం అతిపెద్ద సవాలుగా మారినట్లు బీసి. త్రిపాఠి వివరించారు.
గ్రీన్ ఎనర్జీ గురించి నిర్వహించిన చర్చలో బీ. సి.త్రిపాఠి మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల ప్రభావాలను ప్రపంచం మొత్తం గమనిస్తుందన్నారు. అటువంటి పరిస్థితిలో, శిలాజ శక్తి నుంచి పునరుత్పాదక శక్తికి మారవలసిన అవసరం ఉందని తెలిపారు. దీని ఆధారంగా, రాబోయే తరాలకు ఇంధన, ఆర్థిక వృద్ధి స్థిరమైన భవిష్యత్తును సిద్ధం చేయవచ్చంటూ వివరించారు.
భారతదేశం ‘వన్ నేషన్ వన్ గ్రిడ్’ విధానం గురించి కూడా బీసీ త్రిపాఠి ప్రస్తావించారు. కొన్ని సంవత్సరాల క్రితం, భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పునరుత్పాదక ఇంధనం నుంచి ఉత్పత్తి చేయబడిన ఇంధన వినియోగం.. నిల్వ సమస్య అని ఆయన అన్నారు. దీని తర్వాత, దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘వన్ నేషన్ వన్ గ్రిడ్’ విజన్‌ను రూపొందించారని.. ఇది ఇంధన రంగంలో భారత్‌కు బలం చేకూర్చిందని తెలిపారు.
పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలిచే అవకాశం నేడు భారత్‌కు ఉందన్నారు. ఇది రాబోయే కాలంలో ఉపాధికి, ఆర్థిక వృద్ధికి శక్తిగా మారుతుందన్నారు. ఇది మాత్రమే కాకుండా, పునరుత్పాదక శక్తికి దేశం మారడం, దాని అవశ్యకతను వివరించారు. భారత ప్రభుత్వం కూడా పునరుత్పాదక ఇంధన రంగంలో పరిశ్రమకు చాలా సహాయం చేసిందని.. విధాన నిర్ణేతలు, పరిశ్రమల మధ్య సహకారం పెరిగిందని తెలిపారు.
AM గ్రీన్ గురించి, కంపెనీ 15 సంవత్సరాల క్రితం డి-కార్బొనైజేషన్ ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఒకప్పుడు 20 మెగావాట్ల బయోగ్యాస్ ప్లాంట్‌ను మాత్రమే ఏర్పాటు చేశారు.. నేడు కంపెనీ వివిధ పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి 10,000 MW కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తోందని తెలిపారు.
మూడురోజుల పాటు జర్మనీలో జరిగే న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం భారతదేశం, జర్మనీల మధ్య పెరుగుతున్న సహకారానికి సంకేతం. ప్రపంచ స్థాయిలో సమ్మిట్ ను నిర్వహించిన మొదటి భారత మీడియా హౌస్ గా టీవీ9 నెట్ వర్క్ అవతరించింది.. ఈ సదస్సులో భారత కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొంటున్నారు.
మరిన్ని న్యూస్ 9 గ్లోబల్ సమిట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి