కుక్క విశ్వాసం గల జంతువు అంటుంటారు. పెంపుడు కుక్క చూపించే ప్రేమనే వేరు. ఓ కుక్క తన కొత్త యజమానికి కాదని చివరకు పాత యజమాని వద్దకే కొన్ని కిలోమీటర్ల మేర నడిచి అతని వద్దకు చేరుకుంది. ఈ ఘటనను చూస్తే ఆ కుక్క విశ్వాసం అనంతం అని చెప్పక మానరు. ఒక గోల్డెన్ రిట్రీవర్‌ను అనుకోని పరిస్థితుల వల్ల దాని యజమానులు వదులుకోవాల్సి వచ్చింది. దానిని దత్తత తీసుకున్న మరో కుటుంబం ఆ కుక్కను తమతో పాటు తీసుకెళ్లారు. అయితే తన కొత్త యజమాని ఇంటికి సమీపిస్తుండగా అది కారులోనుంచి దూకి తప్పించుకుంది. అయితే ఆ కుక్క తన పాత యజమానిని విడిచి ఉండలేక 27 రోజుల పాటు 64 కిలోమీటర్లు నడిచి అతని వద్దకు చేరుకుంది. కూపర్ అనే కుక్క ఉత్తర ఐర్లాండ్‌లోని కౌంటీ టైరోన్‌లోని తన కొత్త యజమాని ఇంటికి వచ్చిన వెంటనే కారు నుండి దూకింది. అలా కారులోంచి దూకిన కుక్క జాడ దొరకలేదు. దాదాపు ఒక నెల పాటు వెతికినా దాని ఆచూకీ లభించలేదు. ఆ తరువాత దాని అసలు యజమాని వద్దకు తిరిగి లండన్‌డెరీ కౌంటీలోని టోబెర్‌మోర్‌కు దాదాపు 64 కిలోమీటర్ల మేర ప్రయాణించి చేరుకుంది.
అయితే జంతువుల స్వచ్చంద సంస్థ లాస్ట్ పావ్స్ ఎన్‌ఐ ఈ కుక్క మిస్సింగ్‌పై మాట్లాడారు. కుక్క అక్కడక్కడా పొలాల్లో కనిపించిందని, ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో ఉందని ఏప్రిల్ 22న తమకు టిప్-ఆఫ్ అందిందని చెప్పారు. ఐదు రోజుల తరువాత, కూపర్ తన పాత యజమాని ఇంటి వైపు పరుగెత్తుతున్నట్లు మరొకరు సమాచారం అందించారు. కుక్క ఒంటరిగా అడవుల్లో, ప్రధాన రహదారుల వెంబడి నడుస్తూ వెళ్లింది. ఎక్కువగా మనుషుల సంచారం లేని.. రాత్రిపూట ఎక్కువగా ప్రయాణం చేసిందని తెలుసుకున్నారు.
లాస్ట్ పావ్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. కూపర్ చాలా తెలివైన కుక్క. తనకు తెలిసిన ప్రదేశానికి చేరుకోవడానికి దృఢసంకల్పమే తోడ్పడింది. కూపర్ ఎలా చేయగలిగిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఆహారం లేదు, ఆశ్రయం లేదు, సహాయం లేదు, కేవలం దృఢ సంకల్పం మాత్రమే దానికి తోడుంది అంటూ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా కుక్క యజమాని నిగెల్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. కూపర్ సురక్షితంగా ఉంది. అది చాలా దూరం ప్రయాణించి వచ్చింది. దానికి మరింత బలం అందేందుకు మంచి ఆహారం ఇస్తున్నానని అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి