న్యూజిలాండ్‌లో గాబ్రియెల్ తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది. భారీ వర్షానికి తోడు భీకర గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. దీంతో వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. నార్త్ ఐలాండ్, ఆక్లాండ్‌లో గాబ్రియెల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రికార్డ్ స్థాయిలో కురుస్తున్న వర్షాలు, వరదలతో విలవిలలాడుతున్నారు ప్రజలు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వరదలకు ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు. ఇక పలు విమానాలు రద్దయ్యాయి. స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు.
పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తుపాన్ ప్రభావంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆక్లాండ్ తీరంలో గంటకు 159 కిలోమీటర్ల మేర గాలులు నమోదయ్యాయని మెట్‌సర్వీస్ తెలిపింది. ఈ తుపాన్ భూమికి దగ్గరగా ఉన్నందున గాలులు మరింత తీవ్రతరమయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖాధికారులు.
తుఫాన్ ఇవాళ తీరం దాటే అవకాశముందని..ఆ సమయంలో పెనుగాలులు వీచే అవకాశముందని తెలిపింది వాతావరణశాఖ. అలాగే కుండపోత వానలు పడతాయని..అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. తుఫాన్ తీవ్రత నేపధ్యంలో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం