Nepal Floods: నేపాల్‌ను ముంచెత్తిన కుండపోత వర్షాలు.. 150 మందికి పైగా దుర్మరణం

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. వేర్వేరు ఘటనల్లో ఇప్పటి వరకు 150 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. వరదల్లో పదుల సంఖ్యలో గల్లంతుకాగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు నీటమునిగాయి. 

Nepal Floods: నేపాల్‌ను ముంచెత్తిన కుండపోత వర్షాలు.. 150 మందికి పైగా దుర్మరణం
Landslide Hit Area Kathmandu
Image Credit source: PTI

Updated on: Sep 29, 2024 | 11:11 PM

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.  వేర్వేరు ఘటనల్లో ఇప్పటి వరకు 150 మందికి పైగా మృతి చెందినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. వరదల్లో మరో 56 మంది గల్లంతుకాగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నేపాల్ తీర్పు ప్రాంతంలో శుక్రవారం నుంచే కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి.  నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు నీటమునిగాయి.  కాట్మాండుకు సమీపంలోని భక్తపూర్‌లో కొండచరియలు విరిగిపడి ఒక ఇల్లు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఆ ఇంట్లోని గర్భిణీ స్త్రీ, నాలుగేళ్ల బాలికతో సహా ఐదుగురు మరణించారు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 3 వేల మందిని రక్షించిన ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

నేపాల్‌లో ఈ స్థాయిలో వర్షాలు, వరదలు గత 40-45 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని కొందరు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం.. పాఠశాలలు, కళాశాలలకు 3 రోజుల సెలవు ప్రకటించింది. మంగళవారం వరకు వర్షాలు కొనసాగే అవకాశముందని ఆ దేశ వాతావరణ శాఖ అంచనావేసింది.

నేపాల్‌లో భారీ వర్షాలు..

ఇటు బీహార్‌లోనూ తీవ్ర ప్రభావం..

నేపాల్ లోని వరదల ప్రభావంతో బిహార్‌ కూడా తల్లడిల్లుతోంది. కోసి, గండక్, గంగా నదులు పొంగిపొర్లుతుండటంతో రాష్ట్రంలోని 38 జిల్లాలకు ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. నేపాల్ లో భారీ వర్షాల కారణంగా గండక్ బ్యారేజీలో 5.40 లక్షల క్యూసెక్కుల నీటిని, కోసి బ్యారేజీకి 4.99లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తూర్పు చంపారన్, గోపాల్ గంజ్, అరారియా, సుపాల్, కతిహార్, తదితర జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. కోసీ నదిలో వద్ద పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పలు చోట్ల వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. నది ఒడ్డున నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 55 సంవత్సరాల తరువాత కోసి నదిలో భారీగా వరదనీరు చేరడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. ఆకస్మికల వరదల కారణంగా బిహార్‌ ప్రజలు తల్లడిల్లుతున్నారు. వేల ఎకరాల్లో పంటనష్టం కారణంగా రైతులు లబోదిబోమంటున్నారు.