AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్‌ను వణికించిన భూకంపం.. 5.3 తీవ్రతతో భారీ ప్రకంపనలు.. మరోవైపు వరద ముప్పు!

Nepal Earthquake: భారీ వర్షాలు, వరదలు, కొండచరియలతో సతమతమవుతున్న నేపాల్‌లో మరో ప్రకృతి విపత్తు ఆందోళనకు గురిచేసింది. ముస్తాంగ్ జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోవైపు కిమ్రుంగ్ నదికి కొండచరియలు అడ్డుగా మారడంతో దిగువ ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు.

నేపాల్‌ను వణికించిన భూకంపం.. 5.3 తీవ్రతతో భారీ ప్రకంపనలు.. మరోవైపు వరద ముప్పు!
Nepal Earthquake
Rajashekher G
|

Updated on: Sep 09, 2026 | 9:33 AM

Share

Nepal Earthquake: ఇటీవల భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్‌ను మరో ప్రకృతి విపత్తు వణికించింది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో మంగళవారం రాత్రి 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ముస్తాంగ్ జిల్లాలోని లోమంథాంగ్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధనా కేంద్రం వెల్లడించింది.

మంగళవారం రాత్రి 9:53 గంటలకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం రాజధాని ఖాట్మండుకు సుమారు 375 కిలోమీటర్ల వాయువ్య దిశలో ఉన్న లోమంథాంగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రకంపనలు సమీపంలోని మనాంగ్, డోల్పా, మయాగ్డి జిల్లాల్లోనూ నమోదయ్యాయి.

ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం లేదు

భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. అయితే ప్రకంపనల నేపథ్యంలో అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వరదలు, కొండచరియల విరిగిపడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల్లో తాజా భూకంపం ఆందోళనకు కారణమైంది.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో రహదారి కనెక్టివిటీ దెబ్బతినడంతో పాటు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది.

కొండచరియలతో నదికి అడ్డంకి.. వరద ముప్పు

మరోవైపు గండకీ ప్రావిన్స్‌లోని పర్వత్ జిల్లాలో కిమ్రుంగ్ నది ప్రవాహానికి కొండచరియలు అడ్డుగా మారాయి. దీంతో నది దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మంగళవారం రాత్రి 8 గంటలకు వరద అంచనా విభాగం జారీ చేసిన హెచ్చరిక ప్రకారం.. కిమ్రుంగ్ నది ప్రవాహానికి ఏర్పడిన ఈ అడ్డంకి కారణంగా వరద ముప్పు పొంచి ఉంది. కిమ్రుంగ్ నది మోడీ నదికి ఉపనది.

నయాపుల్, బిరేతాంతి తదితర దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, అలాగే పరిసర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. కిమ్రుంగ్ నది నుంచి కాలిగండకీ నది సంగమం వరకు దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఇప్పటికే వరదలు, కొండచరియలతో సతమతమవుతున్న నేపాల్‌కు తాజా భూకంపం, నదీ ప్రవాహానికి అడ్డంకి మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Follow Us