Monkeypox vs Covid 19: రెండేళ్లుగా కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని హడలెత్తించగా.. ఇప్పుడు మంకీపాక్స్ రూపంలో మరో మాయదారి వైరస్ భయపెడుతోంది. ప్రజలు ఇప్పటికీ కరోనా భయం నుంచి కోలుకోకముందే.. మంకీపాక్స్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలను ప్రభావితం చేస్తున్న మంకీపాక్స్ వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించింది.
ఇప్పటివరకు 70 దేశాలలో 16,000 కేసులు నమోదు అయ్యాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మంకీపాక్స్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. మంకీపాక్స్ అనేక దేశాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం జరిగింది. మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
మంకీపాక్స్ vs కోవిడ్ తేడాలు..
1. కోవిడ్ 19, మంకీపాక్స్ రెండు వైరస్‌లూ వేరు వేరేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
2. కరోనా వైరస్ SARS CoV 2 వల్ల వస్తుంది. మంకీపాక్స్ ఆర్థోపాక్స్ వైరస్ వల్ల వస్తుంది.
3. SARS CoV 2 గాలి ద్వారా, లాలాజలం తుంపర్ల ద్వారా వ్యాపించి ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై దాడి చేస్తుంది.
4. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ వ్యాప్తిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలా? వద్దా? అని నిపుణుల బృందం చర్చించింది. ఈ బృందం తమ నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్‌కు నివేదించింది. ఆ నివేదిక ప్రకారం.. మంకీపాక్స్‌ని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
మంకీపాక్స్, కోవిడ్ 19 లక్షణాలు ఏమిటి?..
కోవిడ్ లక్షణాలు: చలి, జ్వరం, శ్వాస సమస్యలు, కఫం, దగ్గు, తలనొప్పి, బాడీ పెయిన్స్, వాసన కోల్పోవడం, గొంతు నొప్పి, వికారం.
మంకీపాక్స్ లక్షణాలు: జ్వరం, చర్మం దురద, చలి, శరీరంపై దద్దుర్లు, దద్దుర్లు తీవ్రమైన నొప్పి. కొన్ని వారాల పాటు ఉంటుంది.
కోవిడ్ ఎలా వ్యాపిస్తుంది?
కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండే వారికి, అలాగే సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు విడుదలయ్యే వైరస్ గాలి ద్వారా ప్రయాణించి వేరే వ్యక్తికి వ్యాపిస్తుంది.
మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది?
మంకీపాక్స్ చర్మ వ్యాధి లాంటిది. ఈ ఇన్ఫెక్షన్.. సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. మగవారితో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా ఇది వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.
నివారణ ఉందా?
SARS CoV 2ని ఎదుర్కోవడానికి ప్రపంచానికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది. ఈ సమయంలో, కోవిడ్ 19 ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బలితీసుకుంది. మిలియన్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మంకీపాక్స్ కూడా దశాబ్దాలుగా ఉంది. దీనికి వ్యాక్సిన్ తయారు చేసే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. మంకీపాక్స్ రోగులకు మశూచికి ఇచ్చే టీకాను ఇస్తారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..