భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 17న వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారమే లక్ష్యంగా ఈ మీటింగ్ జరగనుందని భారతీయ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ పరస్పర సహకారం, అభివృద్ధి కార్యక్రమాల్లో తోడ్పాటుపై చర్చ జరగనుందని పేర్కొంది.
కరోనా వ్యాక్సినేషన్, ఆ తర్వాత అనుసరించాల్సిన ఆర్థిక వ్యూహాలపై సైతం చర్చ ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య వివిధ స్థాయిల్లో, వివిధ సందర్భాల్లో ఈ విధమైన చర్చలను భవిష్యత్‌లో కొనసాగిస్తామని పేర్కొంది. కాగా, భారత్ – బంగ్లాదేశ్‌ల మధ్య చాలా ఏళ్లుగా సహకారపూర్వక వాతావరణమే కొనసాగుతోంది. బంగ్లా ప్రధాని హసీనా గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సైతం మార్చి నెలలో ముజీబ్ సందర్భంగా ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు.