మళ్లీ యుద్దం.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు.. ఆ ఒప్పందం తర్వాత తొలిసారి..

మిడిల్ ఈస్ట్‌లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న ప్రశాంతత ఒక్కసారిగా బద్దలైంది. టెహ్రాన్ సరిహద్దుల నుండి దూసుకొచ్చిన నిప్పుల బాణాలు పశ్చిమాసియాను మళ్లీ యుద్ధ మేఘాల వైపు నెట్టేస్తున్నాయి. ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుత్తునియలు చేస్తూ.. ఇజ్రాయెల్ భూభాగంపైకి ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. బీరూట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే దాడులకు దిగింది.

మళ్లీ యుద్దం.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు.. ఆ ఒప్పందం తర్వాత తొలిసారి..
Iran Launches Ballistic Missiles At Israel

Updated on: Jun 08, 2026 | 8:14 AM

పశ్చిమాసియాలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రశాంతత ఒక్కసారిగా బద్దలైంది. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ రాజధాని బీరూట్‌పై దాడి చేసిన కొద్ది గంటల్లోనే ఇరాన్ అనూహ్యంగా రంగంలోకి దిగింది. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ భూభాగంపైకి ఇరాన్ భారీ ఎత్తున బాలిస్టిక్ క్షిపణులనుప్రయోగించింది. గడిచిన ఏప్రిల్ 8న ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ నేరుగా జరిపిన మొదటి దాడి ఇదే కావడం గమనార్హం. ఈ పరిణామంతో ఉత్తర ఇజ్రాయెల్ అంతటా యుద్ద సైరన్లు మ్రోగాయి.

బీరూట్ దాడులే కారణం..

హిజ్బుల్లాకు గట్టి పట్టున్న బీరూట్ దక్షిణ శివారు ప్రాంతమైన దాహియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడమే ఇరాన్ ఆగ్రహానికి ప్రధాన కారణం. లెబనాన్ రాజధానిపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఊరుకునేది లేదని టెహ్రాన్ గతంలోనే హెచ్చరించింది. ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో అమెరికాతో జరగాల్సిన పరోక్ష చర్చలను కూడా ఇరాన్ నిలిపివేసింది. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించినప్పటికీ, ఇరుపక్షాల పరస్పర దాడుల వల్ల ఆ ఒప్పందం కుప్పకూలిపోయింది. తాజాగా ఇజ్రాయెల్ బీరూట్ సబర్బ్స్‌ను టార్గెట్ చేయడంతో ఇరాన్ తమ రెడ్ లైన్స్ దాటినట్లు ప్రకటించింది.

ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ టార్గెట్.. ఐరన్ డోమ్ అలెర్ట్

దాడి అనంతరం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన కీలకమైన రామత్ డేవిడ్ ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు స్పష్టం చేశారు. ఇరాన్ దాడులను గుర్తించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెంటనే తమ వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి. శత్రువు ప్రయోగించిన క్షిపణులన్నింటినీ తమ ఎయిర్ ఫోర్స్ గాల్లోనే విజయవంతంగా అడ్డుకుందని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ దాడుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించలేదని ఐడీఎఫ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.

ఇకపై మరింత ధ్వంసం.. ఇరాన్ ఘాటు హెచ్చరిక

ఇరాన్ ఖాటమ్ అల్-అన్బియా దళాల కమాండర్ ఇజ్రాయెల్, దాని మద్దతుదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “బీరూట్ శివారు ప్రాంతాలలో ఇజ్రాయెల్ చేస్తున్న క్రూరమైన దాడులు విస్తరిస్తే ఆక్రమిత ప్రాంతాలపై దాడులు చేస్తామని మేము ముందే హెచ్చరించాం. ఇజ్రాయెల్ ఆర్మీ వెంటనే దక్షిణ లెబనాన్, బీరూట్‌లపై దాడులు ఆపాలి. ఒకవేళ ఇరాన్ చర్యలకు ప్రతిచర్యగా ఇజ్రాయెల్ దాడులను విస్తరిస్తే, రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్ ప్రభుత్వం, దానికి మద్దతు ఇచ్చే దేశాలు మరింత ఘోరమైన, వినాశకరమైన దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ఇరాన్ కమాండర్ స్పష్టం చేశారు. తాజా క్షిపణి దాడులతో మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న మునుపటి శాంతి వాతావరణం ముగిసిపోయిందని, ఏ క్షణంలోనైనా పూర్తి స్థాయి యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us