మనుషులు జీవించడానికి వీలు లేని, పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న ఖండం ఆర్కిటిక్ (Arctic) లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఇది ప్రపంచ దేశాల స్వరూపాలనే మార్చేస్తోంది. ఇప్పటికే 50 శాతం మంచు కరిగిపోగా.. 2040 నాటికి మరో 25 శాతం మంచు కరిగిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు కరిగిపోతే ఆర్కిటిక్‌లో దాగి ఉన్న అపార సంపద బయటపడనుంది. ఇప్పుడు అనేక దేశాల చూపు ఆర్కిటిక్ వైపు పడింది. ఉత్తర ధ్రువం చుట్టూ ఆవరించి ఉన్న ఆర్కిటిక్ మంచు అడుగున అపార ఖనిజ సంపద ఉందని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది. ప్రపంచ చమురు నిల్వల్లో 25 శాతం అంటే 9,000 కోట్ల బ్యారెళ్లు ఇక్కడ ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే గతంలో అంచనా వేసింది. ప్రపంచ సహజవాయు నిల్వల్లో 30 శాతానికిపైగా దాగున్నట్టు ఓ అధ్యయనం బహిర్గతపరిచింది. ద్రవ రూపంలో మరో 4,400 కోట్ల బ్యారళ్ల సహజ వాయువు అక్కడ ఉందని పేర్కొంది. యురేనియం, బంగారం, వజ్రాల వంటి అతి విలువైన ఖనిజ సంపదకు ఆర్కిటిక్ కేరాఫ్ గా మారింది.
ఈ పరిణామాల మధ్య ఈ మంచు ఖండంపై ఆధిపత్యం కోసం అనేక దేశాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఆర్కిటిక్ ఎవరి సొంతం కాదు. కానీ ఆ సముద్రం హద్దుగా ఉన్న ఎనిమిది దేశాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్కడి పలు ప్రాంతాలను తమ సరిహద్దులుగా చెబుతున్నాయి. వాటిని అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి రష్యా. అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్ కూడా ఆర్కిటిక్ సరిహద్దు దేశాలే.
ఆర్కిటిక్ వాతావరణం భారత్‌లో రుతుపవనాల తీరుతెన్నులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. దాంతో భారత్ ఇటీవల ఆ ప్రాంతంపై దృష్టి సారించింది. ఆర్కిటిక్ పాలసీ పేరిట అధికారిక నివేదిక విడుదల చేసింది. ఆర్కిటిక్‌లో శాశ్వత స్థావరం ఏర్పాటుతో పాటు ఉపగ్రహాలను అనుసంధానించే గ్రౌండ్ స్టేషన్లు, ల్యాబ్స్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి