భారత్‌ను టార్గెట్ చేస్తూ మలేషియా ఉగ్రవాదులు పన్నిన భారీ ఉగ్రకుట్రను భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇక్కడ కుట్ర చేసేందుకు ఉగ్రవాదులు ఏకంగా 2 లక్షల డాలర్లు కేటాయించినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఇందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై గట్టి నిఘా పెట్టగా, దీని వెనుక రొహింగ్యా నేత మహ్మద్ నసీర్ ఉన్నట్లు గుర్తించింది. కౌలాలంపూర్ కేంద్రంగా నసీర్ ఉగ్ర వ్యూహాలు రచిస్తుంటాడని తెలుస్తోంది.
అయితే ఈ కుట్రలో వివాదస్పద మతప్రచారకుడు జకీర్ నాయక్ పాత్ర కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్‌పై దాడి చేసేందుకు మయాన్మార్‌కు చెందిన ఓ మహిళకు మలేషియా ఉగ్రవాదులు శిక్షణ కూడా ఇచ్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అయితే భారత్‌లో దాడి చేయబోయే బృందానికి ఈ మహిళే నాయకత్వం వహిస్తున్నట్లు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ లేదా నేపాల్ సరిహద్దుల గుండా నేపాల్‌లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కాగా, ఈ ఉగ్ర నిధుల్లో కొంత భాగం చెన్నైకి చెందిన ఓ హవాలా డీలర్ చేతుల్లోకి వెళ్లిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, అయోధ్య, బోధ్‌గయా, పశ్చిమబెంగాల్‌ల్లోని కీలక నగరాలను టార్గెట్ చేసినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ, యూపీ, బీహార్, పంజాబ్, బెంగాల్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనలు వెళ్లాయి.