Lebanon Blast: లెబనాన్‌లో పేలిన పేజర్లు.. 9 మంది మృతి.. 2800 మందికి గాయాలు.. ఇజ్రాయెల్ ప్రమేయం ఉన్నట్లు అనుమానం

|

Sep 18, 2024 | 6:21 AM

లెబనాన్‌ వరుస పేజర్‌ పేలుళ్లతో వణికిపోయింది. ఓ చిన్నారి సహా తొమ్మది మంది మృతి చెందారు. దాదాపు 2800 మంది గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య మరింత పెరగవచ్చు. గాయపడిన వారిలో ఆరోగ్య కార్యకర్తలు, ఇరాన్ రాయబారి మోజిత్బా అమానీ , హిజ్బుల్లా యోధులు ఉన్నారు. హిజ్బుల్‌ తీవ్రవాదుల దగ్గర ఉన్న పేజర్లు పేలడంతో చాలా నష్టం జరిగింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ ప్రమేయంపై హిజ్బుల్లా అనుమానం వ్యక్తం చేశారు. దాడి తర్వాత లెబనీస్ ప్రభుత్వం ప్రజల వద్ద నున్న పేజర్లను విసిరేయమని కోరింది. పేజర్‌తో పాటు రేడియో, ట్రాన్స్‌మిటర్ కూడా పేలినట్లు సమాచారం.

Lebanon Blast: లెబనాన్‌లో పేలిన పేజర్లు.. 9 మంది మృతి.. 2800 మందికి గాయాలు.. ఇజ్రాయెల్ ప్రమేయం ఉన్నట్లు అనుమానం
Lebanon Serial Blasts
Follow us on

లెబనాన్‌ వరుస పేజర్ల పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని బీరూట్‌తో సహా పలు ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో 2800 మందికి పైగా గాయపడ్డారు. ఓ చిన్నారి సహా తొమ్మది మంది మృతి చెందారు. హిజ్బుల్ తీవ్రవాదుల జేబులో ఉన్న పేజర్లు పేలడంతో చాలామంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తరువాత లెబనాన్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. అంతేకాకుండా లెబనాన్‌లో ఇరాన్‌ రాయబారి మొజ్తాబా యామని కూడా పేజర్‌ పేలుడులో గాయపడ్డారు. సూపర్‌ మార్కెట్‌లో , రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్‌లో వరుస పేలుళ్లు జరగడంతో జనం ఉలిక్కి పడ్డారు. పేజర్లతో పాటు చాలా చోట్ల వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ పేలినట్టు లెబనాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

దక్షిణ లెబనాల్‌ లోని బెకా వ్యాలీలో ఎక్కువ పేలుళ్లు జరిగినట్టు గుర్తించారు. దీని వెనుక ఇజ్రాయెల్‌ హస్తమున్నట్టు లెబనాన్‌ ప్రభుత్వం అనుమానిస్తోంది. బెకా వ్యాలీలో 30 అంబులెన్స్‌ల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. దేశంలో ఇదే పెద్ద భద్రతా వైఫల్యమని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌తో తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితుల్లో ఈ పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. బీరూట్‌ లోని దక్షిణ భాగంలో కూడా వరుస పేలుళ్లు కలకలం రేపాయి. అయితే ఈ పేలుళ్లపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇజ్రాయెల్‌పై హౌతీ తీవ్రవాదులు రాకెట్‌ దాడులు జరిపిన తరవాత ఈ పేలుళ్లు జరగడం సంచలనం రేపుతోంది. హిజ్బుల్‌ తీవ్రవాదుల కమ్యూనికేషన్‌ వ్యవస్థను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్‌ ఈ పేలుళ్లు జరిపినట్టు అనుమానిస్తున్నారు. పాలస్తీనాలో హమాస్‌ తీవ్రవాదులకు , ఇజ్రాయెల్‌కు యుద్దం తీవ్రమైన వేళ ఈ పేలుళ్ళు మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇరాన్‌ కూడా ఈ పేలుళ్లపై సీరియస్‌ అయ్యింది. తమ దేశంలో కూడా ఇజ్రాయెల్‌ ఇలాంటి దాడులు చేసే అవకాశముందని అలర్ట్‌ జారీ చేశారు.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..