సోవియట్ యూనియన్ చివరి నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్ (Mikhail Gorbachev)సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయాన్ని రష్యా వార్తా సంస్థలు ప్రకటించాయి. 1985 నుంచి 1991 వరకూ గోర్బచేవ్ సోవియట్ కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు, సోవియెట్ లీడర్షిప్ లోని తూర్పు దేశాలకు ఏళ్ల తరబడి జరిగిన ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించిన నేతగా గోర్బచేవ్ కు పేరుంది. గోర్బచేవ్ మృతి పట్ల వివిధ దేశాధినేతలు సంతాపాలు ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. గోర్బచేవ్ ఓ దార్శినకత ఉన్న నాయకుడిగా అభివర్ణించారు. ఏళ్ల తరబడి జరిగిన సంఘర్షణలో మార్పు రావాలని కోరిన సాహసిగా చెప్పారు. నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ తో కలసి అణ్వాయుధాల సంఖ్యను విజయవంతంగా తగ్గించారు గోర్బచేవ్. రాజకీయ అణచివేతకు గురైన దేశంలో ప్రజాస్వామ్య విలువలకు పునాది వేశారు. పారదర్శకత, పునర్నిర్మాణ ప్రక్రియలను విశ్వసించిన నేతగా గోర్బచేవ్ కు పేరుంది.
ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించినందుకుగానూ.. గోర్బచేవ్ కు 1990లో నోబుల్ శాంతి బహుమతి లభించింది. కానీ రష్యన్లు మాత్రం ఆయన్ను సోవియట్ విచ్ఛిన్నానికి కారణమైన వ్యక్తిగానే చూడ్డం గమనార్హం. ఈ ఏడాది మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన కీలక పరిణామాలతో గోర్బచెవ్ కు సంబంధముంది. గోర్బచేవ్ అంత్యక్రియలు మాస్కోలోని నోవోడెవిచి శ్మశాన వాటికలో జరగనున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..