ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ఓ మహిళను కిడ్నాప్ చేసిన మిలిటెంట్లు ఆమెపై పలు మార్లు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా బలవంతంగా మానవ మాంసాన్ని వండించి, తినిపించారు. ఈ విషయాన్ని కాంగో హక్కుల సంఘం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాంగోలో ప్రభుత్వానికి, తిరుగుబాటుదారుల మధ్య జరుగుతున్న పోరాటంలో హింస పెరిగింది. ఈ పరిస్థితుల్లో మిలిటెంట్లు మహిళతో పాటు యువకుడిని కిడ్నాప్ చేశారు. కాగా.. మహిళపై చాలాసార్లు అత్యాచారం చేశారు. ఆ యువకుడి గొంతు కోసి చంపేశారు. ఆ మృతదేహాన్ని ముక్కలుగా కోసి వండించారు. అదే ఆహారాన్ని ఖైదీలందరికీ పెట్టినట్లు బాధిత మహిళ అధికారులకు వెల్లడించింది. ఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులకు మహిళను విడుదల చేశారు. ఆమె ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మరొక మిలీషియా బృందం ఆమెను కిడ్నాప్ చేసింది. వారూ ఆమెపై అత్యాచారం చేసినట్లు లుసెంజ్ భద్రతామండలి దృష్టికి తీసుకెళ్లారు.
కాంగోలో ఖనిజ నిల్వలు అధికంగా ఉన్న తూర్పు ప్రాంతంలో వనరులపై చాలా కాలంగా పోరాటం జరగుతోంది. ఈ వివాదం కారణంగా వేలాది మంది చనిపోయారు. మిలియన్ల మంది నిర్వాసితులయ్యారు. ఈ ఘటనను మండలి సంయుక్తంగా ఖండించింది. ఇలాంటి ఘటనలను నిలువరించాల్సిన అవసరం ఉందని, మానవ హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ప్రకటించింది. అంతర్యుద్ధంతో కాంగో నెత్తుటి నేలను తలపిస్తున్న వేళ.. గత 20 ఏళ్లుగా ఐరాస ప్రతినిధులు కాంగోలో శాంతి స్థాపనకు ప్రయత్నిస్తున్నా అది వీలుపడడం లేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..