
మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు భీకర రూపం దాల్చాయి. క్షిపణి దాడులు, నావికాదళ దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మరింత దూకుడు పెంచడంతో టెహ్రాన్‌పై అగ్నిగుండంగా మారింది. ఇరాన్ కూడా.. దాడులను తీవ్రతనం చేసింది.. ఈ క్రమంలోనే.. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయింది. అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఎన్నికైనట్టు ఇరాన్ అధికారంగా ప్రకటించింది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందగా కొత్త సుప్రీం లీడర్‌గా ఆయన రెండో కుమారుడిని ఎన్నుకున్నారు. ఈ ప్రకటన సందర్భంగా వేలాది మంది టెహ్రాన్‌లో గుమికూడారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తమ అప్రూవల్ లేనిదే ఇరాన్‌లో ఏ నాయకుడూ ఎక్కువ కాలం పవర్‌లో ఉండలేడని ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కొత్త బాస్ ఎంట్రీతో మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ మరింత పీక్స్‌కి చేరింది. మరి, ఇప్పుడు ఖమేనీ కొడుకు మొజ్తాబా.. విషయంలో అమెరికా ఏం చేయబోతుందో అన్నది ఉత్కంఠగా మారింది.
కాగా.. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తున్నాయి.. ఇరాన్‌కు ఆర్థిక వ్యవస్థకు జీవనాడి చమురు డిపోలపై వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ రాజధాని దక్షిణ టెహ్రాన్ ప్రాంతంలోని కీలకమైన టోండ్‌గౌయాన్ ఆయిల్ రిఫైనరీతో పాటు మొత్తం మూడు ప్రధాన చమురు డిపోలపై బాంబుల వర్షం కురిపించింది. టోండ్‌గౌయాన్ ఆయిల్ రిఫైనరీపై దాడి ఇరాన్ కూడా కన్ఫామ్ చేసింది. ఇరాన్ మిలటరీకి ఇక్కడ నుంచే చమురును సరఫరా చేస్తుందని, అలాంటి చముల నిల్వలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది.
ఇరాన్ సైతం వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది. బహ్రెయిన్ అమెరికా నావికాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధానకార్యాలయంపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఈ దాడిలో అమెరికా సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ మరోసారి తమపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో పలువురు ప్రజలు తీవ్రంగా గాయపడగా.. అనేక భవనాలు దెబ్బతిన్నాయని తెలిపింది. డ్రోన్ల శకలాలు పడడంతో నగరంలోని సోషల్ సెక్యూరిటీ టవర్‌కు మంటలు అంటుకున్నట్లు వెల్లడించింది. దాడులు కొనసాగుతున్నందున సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలని కువైట్ సైన్యం ప్రజలకు సూచించింది.
యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న సమయంలో దేశాల నేతల వ్యాఖ్యలు సెగలు పుట్టిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇరాన్‌కు చాలా సర్‌ప్రైజ్‌లు ఇస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. అన్ని లక్ష్యాలు సాధించే దాకా ఇరాన్‌పై దాడులను కొనసాగిస్తామని నెతన్యాహూ వెల్లడించారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వెంటనే లొంగిపోవాల్సిందేనని హెచ్చరించారు. ఇటు డొనాల్డ్ ట్రంప్ కూడా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం జరగాలన్నా, ఆ దేశం బేషరతుగా లొంగిపోవడం మినహా మరో మార్గం లేదని తేల్చిచెప్పారు. ఈ హెచ్చరికలపై ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని అంతే దీటుగా స్పందించారు. ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకునే వరకు ఇరాన్ విశ్రమించదని, ట్రంప్ తన చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ యుద్ధంలో ఇప్పటికే 1,000 మందికి పైగా ఇరానియన్లు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తూనే, ఈ పోరాటం అంతత్వరగా ముగియదని, శత్రువులను వదిలే ప్రసక్తే లేదని లారిజాని స్పష్టం చేశారు.
వారం రోజులుగా సాగుతున్న ఈ భీకర యుద్ధం ఇప్పటికే 1,300 మందికి పైగా బలితీసుకుంది. లక్ష మందికి పైగా ప్రజలు నిర్వాసితులుగా మారారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..