34 dead, 11 injured in Kenya road accident: కెన్యాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఎత్తైన వంతెనపై నుంచి కదులుతున్న బస్సు ప్రమాదవశాత్తు నీటి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 34 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు స్థానిక మీడియా సోమవారం (జులై 26) వెల్లడించింది. వివరాల్లోకెళ్తే.. సెంట్రల్ కెన్యాలోని థారక నిథి కంట్రీలో ఆదివారం (జులై 25) సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మెరు నుంచి పోర్ట్ సిటీ వైపు వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి దాదాపు 40 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 34 మంది మరణించినట్లు తెలుస్తోంది. వీరిలో 14 మంది మహిళలు, 18 మంది పురుషులు, ఇద్దరు చిన్న పిల్లలు మృతి చెందగా..తీవ్రగాయాల పాలైన 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు బ్రేక్‌లు ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. రోడ్డు కెమేరాలో రికార్డయ్యిన దృష్యాలు, క్షతగాత్రుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆ దేశ కమిషనర్ మీడియాకు తెలిపారు.
ప్రమాదానికి గురైన బస్సు మోడ్రన్ కోస్ట్ కంపెనీ ట్రావెలింగ్ సంస్థకు చెందినదిగా గుర్తించారు. దీంతో బస్సు ప్రమాదానికి సంబంధించి పూర్తి దర్యాప్తు ముగిసేవరకు ఈ సంస్థకు చెందిన బస్సు సర్వీసులన్నింటినీ తక్షనమే నిలిపివేయవల్సిందిగా నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ సేఫ్టీ అథారిటీ, కెన్యా ట్రాన్స్‌పోర్ట్ రెగ్యులేటర్ విభాగాలు ఆదేశాలు జారీ చేశాయి. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 2021లో కెన్యాలో రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటి వరకు దాదాపు 4,579 మంది మృతి చెందారు. 2020తో పోలిస్తే ఈ సంఖ్య 15 శాతం మేర మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.