Israel-Palestine War: ఇజ్రాయెల్‌ – పాలస్తీనా మధ్య భీకర యుద్ధం.. వేలాది రాకెట్లతో ఇజ్రాయెల్‌‌పై విరుచుకుపడిన హమాస్..

|

Oct 07, 2023 | 4:27 PM

Israel-Palestine conflict: మిడిల్‌ఈస్ట్‌లో మళ్లీ యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య భీకరయుద్దం జరుగుతోంది. గాజా నుంచి హమాస్‌ మిలిటెంట్లు వేలాది రాకెట్లను ప్రయోగించారు. ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. వివాదాస్పద గాజా స్ట్రిప్‌ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు.

Israel-Palestine War: ఇజ్రాయెల్‌ - పాలస్తీనా మధ్య భీకర యుద్ధం.. వేలాది రాకెట్లతో ఇజ్రాయెల్‌‌పై విరుచుకుపడిన హమాస్..
Israel Palestine Conflict
Follow us on

Israel-Palestine conflict: మిడిల్‌ఈస్ట్‌లో మళ్లీ యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య భీకరయుద్దం జరుగుతోంది. గాజా నుంచి హమాస్‌ మిలిటెంట్లు వేలాది రాకెట్లను ప్రయోగించారు. ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. వివాదాస్పద గాజా స్ట్రిప్‌ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా మిలిటెంట్లు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపించారు. జెరూసలెం, టెల్ అవివ్‌ సహా దేశవ్యాప్తంగా ఎయిర్‌ రైడ్‌ సైరన్ల మోత మోగింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. సరిహద్దుల్లోని ప్రజలంతా ఇళ్లల్లోని ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది.

ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించామని హమాస్‌ మిలిటరీ వింగ్‌ హెడ్‌ మొహమ్మద్‌ డెయిఫ్‌ ప్రకటించాడు. ఆపరేషన్‌ ఆల్‌-అక్సా స్ట్రామ్‌’ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్‌ చెప్పారు. డెయిఫ్‌పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ ప్రకటనతో ఇజ్రాయెల్‌ సైన్యం అప్రమత్తమైంది. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ స్థావరాలపై ప్రతిదాడులు చేపట్టినట్లు వెల్లడించింది. మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లను కూల్చేందుకు యాంటీ రాకెట్‌ డిఫెన్స్‌ వ్యవస్థను యాక్టివేట్‌ చేసింది. దీంతో పేలుడు శబ్దాలు భారీగా వినిపిస్తున్నాయి. తాము యుద్ధానికి సిద్ధగా ఉన్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

ఇజ్రాయెల్‌-గాజా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజా స్ట్రిప్‌లో స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌ ఆర్మీ వాహనాలు, పారాచ్యూట్లతో హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. సరిహద్దుల్లోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అటు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. . సరిహద్దుపై ఇజ్రాయెల్‌ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. ఈ దాడుల్లో 50 మంది ఇజ్రాయెల్‌ పౌరుల మృతిచెందగా..100 మందికి పైగా గాయాలయ్యాయని పేర్కొంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

1967 అరబ్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో తూర్పు జెరూసలెం, గాజా ప్రాంతాలను ఇజ్రాయెల్‌ సైన్యం స్వాధీనం చేసుకుంది. స్వతంత్ర పాలస్తీనాలో ఆ రెండు ప్రాంతాలూ అంతర్భాగాలు కావాలనే డిమాండ్‌తో పాలస్తీనా తిరుగుబాటు చేస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..