AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హర్మూజ్‌ ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్ సంచలన ప్రకటన..

హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. యుద్ధ విరమణ ఒప్పందం కుదిరిన 48 గంటలకే హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటించగా, సముద్ర మార్గం యథావిధిగా కొనసాగుతోందని అమెరికా ఖండించింది. స్విట్జర్లాండ్‌లో జరగనున్న చర్చల కోసం సిద్ధమవుతున్న వేళ, లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి. దీంతో చర్చలు వాయిదా పడ్డాయి.

హర్మూజ్‌ ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్ సంచలన ప్రకటన..
Iran Us
Shaik Madar Saheb
|

Updated on: Jun 21, 2026 | 10:38 AM

Share

హర్మూజ్‌ ప్రాంతంలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయా ? మాటల్లో శాంతి, చేతల్లో కనిపించడంలేదా ? శాంతి ఒప్పందం కుదిరిన 48గంటలకే మరోసారి హర్మూజ్ కు గేట్లు వేశామని ఇరాన్ ప్రకటించడంవెనుక కారణమేంటి ? ఇరాన్ నిజంగానే హర్మూజ్‌ను మూసేసిందా..? లేక ఇది చర్చల ముందు ఒత్తిడి రాజకీయమా..? స్విట్జర్లాండ్‌లో చర్చల సమయంలో గల్ఫ్‌లో ఉద్రిక్తత ఎందుకు పెరుగుతోంది..? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ విరమణ ఒప్పందం తర్వాత 60 రోజుల చర్చలకు రంగం సిద్ధమవుతోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరో రెండు రోజుల్లో స్విట్జర్లాండ్‌కు వెళ్తున్నట్లు సైతం ప్రకటించారు. అమెరికా ప్రతినిధులు ఇప్పటికే అక్కడ చర్చలు ప్రారంభించారని తెలిపారు. అయితే.. ఇరాన్ కూడా తన బృందాన్ని పంపిస్తున్నట్లు ప్రకటిస్తూనే ఓ బాంబు పేల్చింది. మధ్యప్రాచ్య యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని అమలు చేయడంపై చర్చల కోసం ఇరాన్, అమెరికా ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లో సమావేశం కావడానికి సిద్ధమవుతున్న తరుణంలో, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని శనివారం మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 16మంది మృతి చెందారు. దీంతో చర్చలకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని ఇరాన్‌ నిర్ణయించుకుంది. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ స్విట్జర్లాండ్‌కు వెళ్లాల్సి ఉండగా.. చివరి నిమిషంలో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

అయితే.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ -IRGC చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. “స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ మూసివేశాం… ఈ మార్గంలో వచ్చే నౌకల భద్రతకు తాము హామీ ఇవ్వలేమని ప్రకటించింది. దీంతో నౌకల రాకపోకలపై మళ్లీ గందరగోళం ఏర్పడింది.

అయితే హర్మూజ్ క్లోజ్ చేశారన్న వార్తలను అమెరికా వెంటనే ఖండించింది. హర్మూజ్‌లో రాకపోకలు కొనసాగుతున్నాయని.. సముద్ర మార్గం పూర్తిగా క్లోజ్ చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. అసలు ఇరాన్ ప్రకటన చేయడానికి ప్రధాన కారణం లెబనాన్. అమెరికా-ఇరాన్ ఒప్పందంలో లెబనాన్‌లో కూడా కాల్పుల విరమణ అమలు కావాలని స్పష్టంగా ఉంది. కానీ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌పై వైమానిక దాడులు చేసింది. ఈదాడుల్లో కొంతమంది చనిపోయారు కూడా. దీనిని ఇరాన్ ఒప్పంద ఉల్లంఘనగా భావిస్తోంది.

అమెరికా ఇజ్రాయెల్‌ను నియంత్రించడంలో విఫలమైందని ఇరాన్ భావిస్తోంది. ఒప్పందం కుదిరినా గ్రౌండ్‌లెవల్లో పరిస్థితులు అలాగే ఉండటంతో అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ ఈప్రకటన చేసి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్‌ను పూర్తిగా మూసేయడం అంత తేలిక కాదు. ఎందుకంటే అక్కడ అమెరికా నౌకాదళం, పలు అంతర్జాతీయ నౌకాదళాలు నిరంతరం పహారా కాస్తుంటాయి. పూర్తిగా క్లోజ్ చేయకున్నా, ఇరాన్ స్ట్రాటజిక్ వార్నింగ్ ఇచ్చినట్లు భావిస్తున్నారు.

అయితే అమెరికా ఇరాన్ ప్రకటనను లైట్ తీసుకోవడానికి కారణం, హర్మూజ్ క్లోజ్ అయిందని అంగీకరిస్తే మార్కెట్లలో భయాందోళనలు పెరుగుతాయి. అందుకే అంతా సాధారణంగానే ఉందన్న సందేశాన్ని అమెరికా ఇచ్చే ప్రయ్తనం చేస్తోందన్న చర్చ కూడా జరుగుతోంది. అంతేకాదు స్విట్జర్లాండ్‌లో జరగబోయే చర్చలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే హర్మూజ్‌పై అమెరికా ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోవైపు చర్చలకు ముందు తన బలం ఏమిటో చూపించి, అవసరమైతే ప్రపంచ ఇంధన సరఫరాపైనా ప్రభావం చూపగలమనే సంకేతం ఇవ్వడమే ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈపరిస్థితుల్లోశాంతి చర్చలు సాఫీగా ముందుకు వెళ్తాయా అన్న అనుమానాలు అంతర్జాతీయంగా పెరిగాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us