
అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. వార్తా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం, చైనాలో తయారైన భుజంపై మోసుకెళ్లే వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలు (MANPADS)ను ఇరాన్ కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. మొదటి విడతలో సుమారు 400 క్షిపణి లాంచర్లు పాకిస్థాన్ మార్గం ద్వారా ఇరాన్‌కు చేరనున్నట్లు వెల్లడించింది. దీంతో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పాక్ పేరు ఎత్తకుండా చైనాపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఒప్పందం విలువ 60 నుంచి 70 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని సమాచారం. 400 షోల్డర్‌ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. వీటితో తమ గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఇందులో చైనాలో తయారైన QW-12, FN-16 వంటి స్వల్ప శ్రేణి వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలు ఉన్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఈ ఒప్పందానికి హాంకాంగ్‌కు చెందిన ఝాంగ్‌కింగ్ బావోషాంగ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు కూడా కథనాల్లో పేర్కొన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్‌లతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ తన రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి ఈ కొనుగోలును కీలక చర్యగా భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఎత్తులో ప్రయాణించే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఈ వ్యవస్థలు పెంచుతాయని అంటున్నారు.
అయితే ఈ వార్తలను చైనా ఖండించింది. ఇరాన్‌కు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదని, ఈ అంశంపై వస్తున్న కథనాలు పూర్తిగా నిరాధారమైనవని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రాంతీయ శాంతి, సంఘర్షణల పరిష్కారానికే తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై స్పందించారు. చైనా నిజంగానే ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే తీవ్ర నిరాశకు గురవుతానని వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గతంలో ఇరాన్‌కు ఆయుధాలు పంపబోమని తనకు హామీ ఇచ్చారని ట్రంప్ గుర్తు చేశారు. అలాగే ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై భారీ సుంకాలు విధించే అవకాశాన్ని కూడా అమెరికా గతంలో హెచ్చరించింది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ట్రంప్ కామెంట్స్ ఇక్కడ చూడండి..
#WATCH | On reports of Iran getting 400 rocket launchers from China via Pakistan, US President Donald Trump says, “That would be surprising. Things like that happen… He (Chinese President Xi Jinping) told me very strongly he wouldn’t partake. But he knows I’d be quite… pic.twitter.com/Qw5BUB6or5
— ANI (@ANI) July 29, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..