అమెరికా దక్షిణ ప్రాంతంలోని ఒక రాష్ట్రం ఆర్కెన్సా.. ఇక్కడ టెక్ ఉద్యోగుల భద్రత కత్తిమీద సాములా మారింది. ఈ క్రమంలోనే ఆర్కెన్సా రాష్ట్రానికి చెందిన 14 ఏళ్ల భారతీయ అమెరికన్ బాలిక మూడు వారాలుగా అదృశ్యమైంది. టెక్ కంపెనీ నుంచి తన తండ్రి ఉద్యోగం పోతుందనే భయంతో బాలిక ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులు తేల్చారు. తన్వి మరుపల్లి అనే బాలిక జనవరి 17న అదృశ్యమైంది. స్కూల్ బస్సులోంచి దిగిన వీడియో పోలీసులు సేకరించారు. తన తండ్రి ఉద్యోగం పోతే, అమెరికా నుంచి బహిష్కరిస్తానని ఆ చిన్నారి భయపడి పోయిందని పోలీసులు భావిస్తున్నారు.
కొన్నాళ్లుగా తన్వీ కుటుంబం చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తోంది. అమెరికా పౌరసత్వం కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. తన్వీ తండ్రి పవన్ రాయ్ మరుపల్లి అమెరికాలోని ఓ టెక్ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే, టెక్ కంపెనీల్లో విస్తృతంగా తొలగింపులు జరుగుతున్న నేపథ్యంలో తన తండ్రి కూడా ఉద్యోగం కోల్పోతాడని తన్వి భయపడింది. ఈ క్రమంలోనే ఒక లెటర్ రాసిపెట్టిన తన్వి ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు.
అయితే తన గురించి ఆందోళన చెందవద్దని పవన్ తన కుమార్తెకు గతంలోనే వివరించి చెప్పినట్లు సమాచారం. గత నవంబర్ నుంచి దాదాపు రెండు లక్షల మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. తన్వీ తల్లి శ్రీదేవి ఇదర కూడా ఉద్యోగం కోల్పోయింది. దీంతో శ్రీదేవి ఇండియాకు తిరిగొచ్చింది. ఆ తర్వాత మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్నట్టుగా తెలిసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..