India – China Disengagement: లడఖ్‌లోని గల్వాన్ లోయలో గతేడాది జూన్ 15న భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నాటినుంచి సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా సడలుతున్నాయి. తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి నుంచి భారత్, చైనా దళాలు క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయి. గత కొంతకాలం నుంచి సరిహద్దు ప్రాంతాల్లో మోహరించి ఉన్న ఇరు దేశాల దళాలు తిరిగి వెనక్కి వెళ్తున్న దృశ్యాల వీడియో, ఫొటోలను మంగళవారం భారత ఆర్మీకి చెందిన నార్తర్న్ కమాండ్ విడుదల చేసింది. లడఖ్ వాస్తవాధీన రేఖ, పాంగోంగ్ త్సో సరస్సు నుంచి యుద్ధ ట్యాంకులతో చైనా సైన్యం వెనెక్కి వెళ్తున్న చిత్రాలను రిలీజ్ చేశారు.
భారత్ – చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని.. దళాల ఉపసంహరణకు ఒప్పందం సైతం అయినట్లు ఫిబ్రవరి 11న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో వెల్లడించారు. అనంతరం దళాల ఉపసంహరణ వేగవంతంగా జరుగుతోంది. అయితే ఇప్పటికే తొమ్మిదిసార్లు రెండు దేశాల మధ్య సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగాయి. తొమ్మిదో సారి కమాండర్ స్థాయిలో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు దళాల ఉపసంహరణకు అంగీకరించాయి. అనంతరం భారత్, చైనా దళాలు ట్యాంకులను తరలించడం, నిర్మాణాలను కూల్చివేయడం, ఆయా ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహారించే ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నాయి.
Also Read: