నెలల తర్వాత తెరుచుకున్న హోర్ముజ్ మార్గం.. భారత నౌక ‘దిశా’తో ప్రారంభమైన ఇంధన రవాణా!

అమెరికా-ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు తెరపడుతూ శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరట లభించింది. పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం నేపథ్యంలో ప్రపంచ చమురు, సహజవాయు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించనున్న తొలి నౌకగా ‘దిశా’ నిలిచింది.

నెలల తర్వాత తెరుచుకున్న హోర్ముజ్ మార్గం.. భారత నౌక ‘దిశా’తో ప్రారంభమైన ఇంధన రవాణా!
Disha Lng Tanker Crosses Strait Of Hormuz

Updated on: Jun 15, 2026 | 3:16 PM

అమెరికా-ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు తెరపడుతూ శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఊరట లభించింది. పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం నేపథ్యంలో ప్రపంచ చమురు, సహజవాయు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించనున్న తొలి నౌకగా ‘దిశా’ నిలిచింది.

‘దిశా’ అనే LNG ట్యాంకర్ ఖతార్‌లోని రాస్ లఫాన్ పోర్టు నుంచి ద్రవీకృత సహజవాయువు (LNG)ను తరలిస్తోంది. మాల్టా జెండా కింద నడుస్తున్న ఈ నౌక AIS రికార్డుల్లో భారతీయ నౌకగా నమోదై ఉండటం ఆసక్తికరంగా మారింది. అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా మార్చి 2 నుంచి ఈ నౌక రాస్ లఫాన్‌లోనే నిలిచిపోయింది. అయితే శాంతి ఒప్పందం అనంతరం మళ్లీ ప్రయాణం ప్రారంభించినట్లు మెరైన్ ట్రాఫిక్ డేటా వెల్లడించింది. 277 మీటర్ల పొడవు, 44 మీటర్ల వెడల్పు ఉన్న ఆ నౌక మూడు నెలలకు పైగా పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయింది.

బ్లూమ్‌బెర్గ్ సేకరించిన షిప్-ట్రాకింగ్ సమాచారం ప్రకారం, మార్చి 1న ఈ ట్యాంకర్ LNG సరుకును లోడ్ చేసుకుని బయలుదేరేందుకు సిద్ధమైంది. కానీ యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రయాణం నిలిచిపోయింది. ఇప్పుడు ఒప్పందం కుదరడంతో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే తొలి ట్యాంకర్‌గా ‘దిశా’ గుర్తింపు పొందుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత హోర్మూజ్ జలసంధిని దాటనున్న తొలి పెద్ద ట్యాంకర్‌గా ‘దిశా’ నిలిచింది. ఇది గుజరాత్‌లోని దహేజ్ పోర్టుకు బయలుదేరింది. జూన్ 18న అది అక్కడికి చేరుకుంటుందని అంచనా.

ఇక ఒప్పందం ప్రకారం ఇరాన్ చమురు ఎగుమతులపై విధించిన కొన్ని ఆంక్షలను తాత్కాలికంగా సడలించనున్నట్లు సమాచారం. అలాగే అమెరికాలో స్తంభింపజేసిన సుమారు 25 బిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ ఆస్తుల విడుదలపై కూడా అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. మార్చి నుంచి ఐరోపా, ఆసియాలో పెరిగిన గ్యాస్ ధరలు, సరఫరా కొరత సమస్యలకు ఇది ఉపశమనం కలిగించనుంది. శాంతి ఒప్పందం వార్తలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు కూడా స్పందించాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతానికి పైగా పడిపోవడం, ఇంధన సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయనే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us