ఎన్నడూ లేనిది పాకిస్తాన్ నిధుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది.. సొమ్ముల్లేక విలవిలలాడుతోంది. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే చివరకు ఇస్లామాబాద్ లోని తన అధికారిక నివాసాన్ని అద్దెకు ఇస్తానని స్వయంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. విశాలమైన ఈ బంగళాను ఆయన ఖాళీ చేస్తారని పాలక తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ ప్రకటించింది. దీన్ని ఇక పీజీ ఇన్స్ టిట్యూట్ గా మార్చే యోచన ఉందని తెలిపింది. భారీగా పెరిగిపోయిన ఖర్చులను తగ్గించుకుని ఆ నిధులను సంక్షేమ పథకాలకు వినియోగిస్తారట.తన భవనాన్ని విద్యా సంస్థగా మార్చేందుకు ఇమ్రాన్ ఖాన్ కూడా సుముఖంగానే ఉన్నారు. దీని నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని విద్యా శాఖ మంత్రి షఫ్ ఖత్ మెహమూద్ తెలిపారు. ఇంతేకాదు.. గవర్నర్ల బంగళాలకు కూడా రోజులు దగ్గర పడ్డాయి. లాహోర్ లోని గవర్నర్ బంగళాను, కరాచీలోని బంగళాను మ్యూజియంలుగా , ముర్రే లోని దాన్ని మ్యూజియం,,ఆర్ట్ గ్యాలరీగా మార్చే యోచన కూడా ఉందని ఆ మంత్రి చెప్పారు.
మా ప్రభుత్వం వద్ద నిధుల్కేవని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అందుకే నిధుల కోసం చైనా మీద ఆధారపడుతున్నామని చెప్పారు. 2019 లోనే ప్రధాని అధికారిక నివాసాన్ని వెడ్డింగ్ వెన్యూగా మార్చేశారట. ఈయనకు మిలిటరీ సెక్రెటరీ అయిన బ్రిగేడియర్ వసీం ఇఫ్ధికార్ చీమా కుమార్తె పెళ్ళికి దీన్ని అద్దెకు ఇచ్చారట.. బ్రహ్మాండంగా జరిగిన ఈ వెడ్డింగ్ కి ఇమ్రాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. అంటే అప్పటి నుంచే ఓ మాదిరిగా నిధుల కటకటను ఎదుర్కొంటున్నా..ఇప్పుడు మరీ పరిస్థితి జటిలమైంది.