Elon Musk: రష్యా అవసరమైతే దానికి కూడా తెగిస్తుంది.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు..
యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌కు మస్క్ సాయం అందించారు. రష్యా దాడుల్లో మౌలిక వసతులను కోల్పోయిన ఆ దేశానికి.. మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నారు. రష్యాపై పోరాటంలో ఆ దేశ సైన్యానికి, ప్రజలకు ఇది కీలక వనరుగా కూడా మారింది. అయితే..

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి స్వస్తి పలకాలని శాంతి ప్రణాళికను సూచించి ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై స్పందించారు. అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం రష్యా అవసరమైతే అణ్వాయుధాలు ఉపయోగిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అణ్వాయుధాలను ఉపయోగిస్తే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశముందని తన మాటగా చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధంపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఎలాన్ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. అణు యుద్ధం జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా అంటూ ట్విట్టర్ లో ఓ నెటిజన్ ఎలాన్ మస్క్‌కు ట్వీట్ చేశారు. దీనికి ఆయన స్పందిస్తూ.. క్రిమియాను వదులుకోవడమా లేదా యుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించాలా అనే పరిస్థితి ఎదురైనప్పుడు రష్యా కచ్చితంగా రెండో అవకాశాన్నే ఎంచుకుంటుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాలు రష్యాపై సాధ్యమైన అన్ని ఆంక్షలను విధించిందని, ఇంకా ఆ దేశం కోల్పోవడానికి ఏముంది.. ఒకవేళ రష్యాకు ప్రతిస్పందనగా ఎవరైనా అణ్వాయుధాలను ఉపయోగిస్తే.. వారు మరిన్ని అణ్వాయుధాలను ప్రయోగిస్తారు. అప్పుడు అది మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు ఎలాన్ మస్క్ ఇటీవల ఓ శాంతి ప్రణాళికను ట్విటర్‌లో ప్రకటించి వార్తల్లో నిలిచారు. అయితే ఈ ప్రణాళికను ట్వీట్ చేయడానికి ముందు ఆయన నేరుగా పుతిన్‌తో మాట్లాడారని కొన్ని కథనాలు వెలువడ్డాయి. వీటిని టెస్లా అధినేత మస్క్ ఖండించారు.
కాగా యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌కు మస్క్ సాయం అందించారు. రష్యా దాడుల్లో మౌలిక వసతులను కోల్పోయిన ఆ దేశానికి.. మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నారు. రష్యాపై పోరాటంలో ఆ దేశ సైన్యానికి, ప్రజలకు ఇది కీలక వనరుగా కూడా మారింది. అయితే ఈ స్టార్‌లింక్ సేవలను ఇకపై కొనసాగించే స్థితిలో లేమని ఇటీవల స్పేస్‌ఎక్స్ సంస్థ పెంటగాన్‌కు రాసిన ఓ లేఖలో పేర్కొంది. ఈ సేవల విషయంలో తమకు అందుతోన్న స్వచ్ఛంద సాయం చివరి దశకు వచ్చిందని.. పెంటగాన్ ప్రతినెలా పదుల మిలియన్ల డాలర్లను వెచ్చిస్తేనే సర్వీసుల కొనసాగింపు సాధ్యమవుతుందని తెలిపింది.
ఉక్రెయిన్‌లో స్టార్ లింక్‌కు నిధులు అందించేందుకు పెంటగాన్ సుముఖంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మస్క్ స్పందిస్తూ.. అమెరికా రక్షణ శాఖ నుంచి తమకు ఎలాంటి నిధులు రాలేదని ప్రకటించారు. మొత్తం మీద ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా అణుయుద్ధానికి దిగుతుందా అనే దానిపై మస్క్ మాత్రం రష్యా లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎంతకైనా వెళ్తుందని చెప్పారు.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..