హెలెన్ తుఫాను మరువక ముందే మరో తుఫాను అమెరికా ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. హరికెన్ మిల్టన్ తుఫాను ప్రభావంతో ఫ్లోరిడా వణుకుతోంది. అమెరికాలో మిల్టన్ హరికేన్ కారణంగా విధ్వంసం సంభవించే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా ఫ్లోరిడా వైపు మిల్టన్ వెళ్తుంది. గంటలకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు బీభత్సంగా వీస్తున్నాయి. టంపా బే తీరాన్ని వాతావరణ శాఖ అలర్ట్ చేశారు. కేటగిరి-5 హరికెన్‌గా వాతావరణ శాఖ గుర్తించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది.
తీవ్ర తుఫాను దృష్ట్యా ఫ్లోరిడాలోని అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయమని ఆదేశించింది. 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. హెలెన్ హరికేన్ విధ్వంసం సృష్టించిన రెండు వారాల తర్వాత భారీ తుఫాను వచ్చింది. హరికేన్ మిల్టన్ బుధవారం తీరాన్ని తాకవచ్చునని అధికారులు వెల్లడించారు. పశ్చిమ-మధ్య ఫ్లోరిడాను తాకిన అత్యంత విధ్వంసకర హరికేన్‌లలో మిల్టన్ ఒకటి అని యుఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. టంపా బేకు ఉత్తరం, దక్షిణ తీరప్రాంతం వెంబడి 10 నుండి 15 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని సూచించారు.
127 నుండి 254 మిమీ లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అమెరికన్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో వరద ముప్పు కూడా పొంచి ఉంది. దాదాపు 900 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యం కానున్నాయి. దాదాపు 700 విమానాలు రద్దయ్యాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన అక్టోబర్ 10-15 జర్మనీ, అంగోలా పర్యటనను వాయిదా వేసినట్లు వైట్ హౌస్ మంగళవారం తెలిపింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..