
హాంకాంగ్‌లోని ఒక బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 13 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. తాయ్ పో జిల్లాలోని 35 అంతస్తుల హౌసింగ్ కాంప్లెక్స్‌లో బుధవారం (నవంబర్ 26) మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తొమ్మిది మంది సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించగా, వారు మరణించారని అగ్నిమాపక శాఖ తెలిపింది. అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన హౌసింగ్ కాంప్లెక్స్‌లోని వందలాది మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు.
భవనం వెలుపలి భాగంలో పునరుద్ధరణ పనుల సమయంలో ఏర్పాటు చేసిన వెదురు స్కాఫోల్డింగ్ కారణంగా మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. ఈ చెక్క- వెదురు నిర్మాణం మంటలను పై అంతస్తులకు తీసుకువెళ్లింది. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనలు, క్రేన్లను ఉపయోగించి ప్రజలను రక్షించడానికి ప్రయత్నించారు. ఆ నివాస సముదాయంలో సుమారు 2 వేల ఇళ్లు ఉన్నాయని, అందులో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దాదాపు 4,800 మంది నివసిస్తున్నారు.
భవనం పై అంతస్తుల నుండి నల్లటి పొగ దట్టంగా ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా మంది కిటికీల నుండి కాపాడాలంటూ అర్తనాదాలు చేస్తూ.. వేడుకుంటున్నట్లు దృశ్యాలు కనిపించాయి. “ఈ భవనంలో ఎక్కువగా వృద్ధులు నివసిస్తున్నారు. వీరిలో చాలామంది నడవలేకపోతున్నారు. పై అంతస్తులలో మంటలు వేగంగా వ్యాపించాయి. దీని వలన తప్పించుకోవడం కష్టంగా మారింది” అని తాయ్ పో జిల్లా కౌన్సిల్ సభ్యుడు లో హియు-ఫంగ్ స్థానిక మీడియాకు తెలిపారు.
మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సాయంత్రానికి దానిని నియంత్రించడానికి, అగ్నిమాపక శాఖ హెచ్చరిక స్థాయిని థర్డ్ డిగ్రీకి పెంచింది. 128 అగ్నిమాపక వాహనాలు, 57 అంబులెన్సులను ఘటనా స్థలానికి తరలించారు. స్థానిక సమయం రాత్రి 9 గంటల నాటికి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదం తర్వాత, దాదాపు 700 మంది నివాసితులను సురక్షితంగా ఖాళీ చేయించి సమీపంలోని పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్లలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. చాలా కుటుంబాలకు ప్రస్తుతం బట్టలు, మందులు కరువయ్యాయి. మంటల్లో చిక్కుకున్న వారిలో వృద్ధులు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అయితే భవనం పునరుద్ధరణ పనుల సమయంలో వెల్డింగ్ స్పార్క్‌ల కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. హాంకాంగ్‌లో, పాత భవనాల వెలుపల వెదురు పరంజా నిర్మించడం సర్వసాధారణం. కానీ భద్రతా ప్రమాణాలను విస్మరించడం తరచుగా పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ క్రమంలోనే ఈ భారీ ప్రమాదం సంభవించినట్లు స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు.
ఈ సంఘటనపై హాంకాంగ్ ముఖ్యమంత్రి జాన్ లీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. భవనాల్లో అగ్ని భద్రతా ప్రమాణాలను వెంటనే సమీక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇటీవలి సంవత్సరాలలో హాంకాంగ్‌లో జరిగిన అత్యంత దారుణమైన నివాస అగ్నిప్రమాదం ఇదేనని భావిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..