మీకెంత ధైర్యం.. ప్రపంచ నేతలను ఏకిపారేసిన చిన్నారి

మీకెంత ధైర్యం అంటూ ప్రపంచ నేతలను ఏకిపారేసింది 16 ఏళ్ల ఓ చిన్నారి. మా కలల్ని చిదిమేస్తున్నారు. మా బాల్యాన్ని దోచుకుంటున్నారు. ఇదంతా తప్పు. మీకెంత ధైర్యం అంటూ ఐక్యరాజ్యసమితి వేదికగా గ్రెటా ఉద్వేగంతో ప్రసంగించింది. గత కొన్ని ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న గ్రెటా.. వాతావరణ మార్పులపై ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇలాగే కొనసాగితే తమ తరం భయంకరమైన విపత్తును ఎదుర్కోక తప్పదంటూ ఆమె హెచ్చరించింది. అయితే […]

మీకెంత ధైర్యం.. ప్రపంచ నేతలను ఏకిపారేసిన చిన్నారి

Edited By:

Updated on: Sep 24, 2019 | 2:20 PM

మీకెంత ధైర్యం అంటూ ప్రపంచ నేతలను ఏకిపారేసింది 16 ఏళ్ల ఓ చిన్నారి. మా కలల్ని చిదిమేస్తున్నారు. మా బాల్యాన్ని దోచుకుంటున్నారు. ఇదంతా తప్పు. మీకెంత ధైర్యం అంటూ ఐక్యరాజ్యసమితి వేదికగా గ్రెటా ఉద్వేగంతో ప్రసంగించింది. గత కొన్ని ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న గ్రెటా.. వాతావరణ మార్పులపై ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇలాగే కొనసాగితే తమ తరం భయంకరమైన విపత్తును ఎదుర్కోక తప్పదంటూ ఆమె హెచ్చరించింది.

అయితే ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆధ్వర్యంలో ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో ప్రపంచ నేతలు మాట్లాడటానికి ముందు గ్రెటా థన్‌బర్గ్‌ ప్రసంగించింది. ‘‘ఈ రోజు నేను ఇక్కడ ఉండాల్సింది కాదు. స్కూల్లో చదువుకోవాల్సింది. కానీ పరిస్థితులు నన్ను ఇక్కడకు తీసుకొచ్చాయి. మీ అర్థం లేని మాటలతో మా కలల్ని, మా బాల్యాన్ని దోచుకుంటున్నారు. మీకెంత ధైర్యం? వాతావరణ మార్పులతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం పర్యావరణం దెబ్బతింటోంది. భూమండలంపై మానవజాతి త్వరలో అంతరించపోనుంది. ప్రమాదకరమైన పరిణాలు వెన్నాడున్నాయి. అయినా మీరు మాత్రం డబ్బు, ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మీకెంత ధైర్యం? మా ఆవేశం, ఆవేదన అర్థం అవుతోందని మీరు చెబుతున్నారు. నిజంగా మీకు అర్థమైతే ఎందుకు పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవట్లేదు. మీరు మమ్మల్ని ప్రకృతి ముందు ఓడిపోయేలా చేస్తున్నారు. కానీ మీ మోసాన్ని నేటి యువతరం అర్థం చేసుకుంటుంది. భవిష్యత్‌ తరాల కళ్లన్నీ మీపైనే ఉన్నాయి. మీరు ఇలాగే మమ్మల్ని ఓడిపోయేలా చేస్తే మేం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించబోం’’  అని గ్రెటా థన్‌బర్గ్‌ భావోద్వేగంతో మాట్లాడింది.

ప్రస్తుతం ఆమె ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. గ్రెటాపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ కూడా గ్రెటాపై అభినందనల వర్షం కురిపిస్తూ.. నువ్వు అందరికీ ఆదర్శం అంటూ కామెంట్ పెట్టారు.

కాగా స్వీడన్‌కు చెందిన 16ఏళ్ల గ్రెటా.. గత కొంతకాలంగా పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తూ అందరిని ఆలోచింపజేస్తోంది. స్కూల్‌ మానేసి మరీ తన పోరాటాన్ని ఆమె సాగిస్తోంది. అంతేకాదు గతేడాది ఆగష్టు నుంచి ప్రతి శుక్రవారం స్వీడన్ పార్లమెంట్ ముందు ఒంటరిగా ధర్నాను చేస్తోంది గ్రెటా. ఇక ఆమెకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని స్కూల్‌ విద్యార్థులు కూడా పోరాటం చేపట్టారు. ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ పేరుతో వారందరూ ఉద్యమం సాగిస్తున్నారు.