ఓ వైపు కుక్కలను ఎంత ఇష్టంగా పెంచుకుంటారో.. మరో వైపు వీధి కుక్కల పట్ల భయాందోళనలకు గురవుతారు. పెంపుడు కుక్కలైనా లేదా వీధి కుక్కలైనా కుక్కల దాడుల గురించి ప్రతిరోజూ అనేక రకాల వార్తలు వస్తున్నాయి. గ్రీస్‌లోని ఉత్తర నగరం థెస్సలోని చోటు చేసుకున్న ఓ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై 3 కుక్కలు దాడి చేసి కరిచి చంపాయి. ఆ మహిళకు దాదాపు 50 ఏళ్లు ఉంటాయి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నియోచొరౌడా గ్రామంలో నివసిస్తున్న మహిళ తన తోటలో పని చేసుకుంటుంది. ఇంతలో మూడు కుక్కలు తాము ఉండే ఆవరణలోంచి పారిపోయి మహిళ ఉన్న తోటలోకి ప్రవేశించాయి. ఈ క్రమంలో తోటలో పనిచేస్తున్న ఓ మహిళపై మూడు కుక్కలు దాడి చేశాయి. కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు మహిళ తీవ్రంగా ప్రయత్నించింది. మూడు కుక్కలు ఆ మహిళ శరీరాన్ని కొరికి లోతైన గాయాలను చేశాయి. మహిళ శరీరాన్ని గాయపరచడమే కాదు కట్టుకున్న దుస్తులను కూడా చింపి పీలికలు చేశాయి. ఆ మహిళ కేకలు వేసినా ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు.
కుక్క దాడి సమయంలో తోటలో పని చేస్తున్న మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి చెవిటి, మూగవాడని, అతనికి వినిపించదని, మాట్లాడడం కూడా రాదని పోలీసులు తెలిపారు. మహిళ అరుపులు విన్న ఆ వ్యక్తి కుక్కల దాడి నుంచి మహిళను కాపాడడానికి రాకపోవడానికి ఇదే కారణం. ఈ సమయంలో కొంతమంది పొరుగువారు మహిళ అరుపులు విని.. గబగబా తోటకి చేరుకున్నారు. కుక్కలను తరిమివేసి మహిళను రక్షించారు. అయినప్పటికీ అప్పటికే చాలా ఆలస్యం అయింది.
కుక్కలు దాడి చేయడంతో మహిళ శరీరం తీవ్రంగా గాయపడింది. ఆమె శరీరం నుండి రక్త స్రావం తీవ్రమైంది. కాగా ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అంబులెన్స్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మహిళ మృతి చెందింది. ఈ విషయమై కుక్కల యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కుక్కల ఎన్‌క్లోజర్‌లో ఒక పెద్ద రంధ్రం ఏర్పడిందని, దీంతో మూడు కుక్కలు ఎన్‌క్లోజర్ నుండి బయటకు వచ్చి పారిపోయాయని పోలీసులు తెలిపారు. మూడు కుక్కలను ఇప్పుడు కుక్కల బోన్ లో ఉంచుతామని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..