దుబాయ్‌లోని ఓ నివాస భవనంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయని.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు దుబాయ్ అధికార యంత్రాంగం ప్రకటించింది. మృతుల్లో నలుగురు భారతీయులు ఉన్నారు.. ఈ మేరకు దుబాయ్ భారత రాయబార కార్యాలయం అధికారులు ప్రకటన విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం అల్ రాస్‌లోని ఓ భారీ భవనంలో మంటలు చెలరేగినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి తెలిపారు. నాలుగో అంతస్థులో మంటలు చెలరేగాయని తెలిపారు. క్షణాల్లోనే భవనం మొత్తం మంటలు వ్యాపించాయన్నారు. ఈఘటనలో 16 మంది మరణించారని.. వారిలో నలుగురు భారతీయులు ఉన్నట్లు పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ నిబంధనలను ఉల్లంఘించిందని.. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.
కాగా.. మరికొన్ని మృతదేహాలను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా.. స్థానిక అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని, మృతదేహాలను భారత్‌కు పంపేందుకు సహకరిస్తామని రాయబార కార్యాలయం ప్రకటించింది.మరణించిన నలుగురిలో కేరళకు చెందిన భార్యాభర్తలు రిజేష్ (38), అతని భార్య జిషి (32), మరో ఇద్దరు తమిళనాడుకు చెందిన వ్యక్తులు అబ్దుల్ ఖాదర్, సలియాకుండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..