370 ఆర్టికల్ రద్దు. ఇప్పుడిదే ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్. ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను దోషిగా చూపేందుకు పాక్ చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. కశ్మీర్ అంశంలో తమకు మద్దతివ్వాలని కోరుతోంది. ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగమంత్రి జై శంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ వాంగ్ ఖిషాన్, విదేశాంగమంత్రి వాంగ్ యీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.
అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో భారత్, చైనా సంబంధాలు మరింత బలోపేతమవ్వాలని ఆకాంక్షించారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. కశ్మీర్ నిర్ణయాలు తమ అంతర్గత వ్యవహారమని..వాటి ప్రభావం సరిహద్దుపై ఉండదని తేల్చి చెప్పారు. భారత్ ఆర్టికల్ 370 రద్దును ఖండిస్తున్నామని చైనా ప్రకటించిన నేపథ్యంలో జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారకూడదని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య గతంలో ఏర్పడిన సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని..ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేయాల్సిన అవసరముందన్నారు జైశంకర్.
ఇక కశ్మీర్ అంశంపై స్పందించిన వాంగ్ యీ..భారత్, పాక్ మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరత నెలకొల్పడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ మధ్య సుహ్రుద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని..ఈ భేటీతో ఇరు దేశాల మధ్య బంధాలు బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐతే
పాక్ విదేశాంగమంత్రి ఖురేషీ చైనా పర్యటన ముగిసిన వెంటనే..జై శంకర్ చైనాలో పర్యటించడం..ముఖ్య నేతలతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.