US Woman Soldiers Nicole Gee: అఫ్ఘానిస్థాన్ రక్తమోడుతోంది. ముష్కరుల దాడిలో భీతిల్లుతోంది. ఇరువర్గాల బాంబుల దాడిలో వందలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. వేలాది మంది క్షతగాత్రులవుతున్నారు. ఈ క్రమంలో కుటుంబాన్ని కోల్పోయిన అఫ్ఘాన్‌కు చెందిన ఓ పసికందును చేరదీసింది అమెరికా సైనికురాలు సార్జెంట్ నికోల్ ఎల్ గీ. అయితే, తాజాగా జరిగిన బాంబుదాడిలో చిన్నారిని లాలించిన నికోల్ ఇకలేరు. కాబూల్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో గాయపడిన నికోల్ చికిత్సపొందుతూ చనిపోవడం అందరినీ కలచివేసింది.
ఆరు రోజుల క్రితం అమెరికా రక్షణ శాఖ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. అందులో ఓ మహిళా సైనికురాలు సార్జెంట్ నికోల్ ఎల్ గీ.. అఫ్గాన్‌కు చెందిన ఓ పసికందును ఎత్తుకోని లాలిస్తుంటుంది. అదే పోస్టు ఆ యువతి కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ‘నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను’ అని దానికి క్యాప్షన్ ఇచ్చింది. కాబుల్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అమెరికన్లను కదిలించింది. ఆమె మరణించడానికి కచ్చితంగా ఆరు రోజుల ముందు పోస్టు చేసిన ఫొటోను చూసి అమెరికన్లు చలించిపోతున్నారు.
నికోల్ భర్త కూడా కూడా మెరైన్‌గా పనిచేస్తున్నారు. నికోల్ సోదరి మిస్టీ ఫ్యూకో దీనిపై స్పందించారు. తన సోదరే తనకు హీరో, బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపారు. నికోల్ అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కోసం క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమాన్ని ఆమె చేపట్టింది. కొన్ని రోజుల్లోనే 1,40,000 డాలర్లు చందాల రూపంలో వచ్చాయి. ఈ మొత్తాన్ని ఆమె అంత్యక్రియల నిమిత్తం వెచ్చిస్తామని మిస్టీ వెల్లడించింది. నికోల్ భౌతిక కాయాన్ని తెచ్చేందుకు అయ్యే ఖర్చులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొని తుది వీడ్కోలు చెప్పేందుకు ఖర్చుల నిమిత్తం దీనిని వినియోగిస్తామని పేర్కొన్నారు.