Golden Tongues: ఈజిప్టులో పురావస్తు శాస్త్రవేత్తలు తరచూ తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఈ తవ్వకాల్లో ఎప్పుడూ ఏదో విశేషాన్ని గుర్తిస్తారు. తాజాగా ఈ జిప్టులోని కొన్ని సమాధులపై పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఒక రాజవంశానికి చెందిన రెండు సమాధులు వెలుగులోకి వచ్చాయి. వీటిల్లో బంగారపు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా శాస్త్రవేత్తలను బంగారు నాలుక ఆకర్షించింది.
ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌లో రెండు వేల ఏళ్ల క్రితం నాటి సైటే రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించామని కైరోలోని పురావస్తుశాఖ ప్రకటించింది. స్పానిష్ పురావస్తు మిషన్ ద్వారా ఈ సమాధులను కనుగొన్నట్లు తెలిపింది. ఈ సమాధులలో ఒకదానిలో బంగారు నాలుకలతో ఉన్న ఇద్దరు అపరిచిత వ్యక్తుల అవశేషాలను కనుగొన్నట్లు సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ సెక్రటరీ జనరల్ మోస్తఫా వాజిరి వెల్లడించారు.
ఇంకా సమాధి లోపల ఒక మహిళ ఆకారంలో ఉన్న సున్నపురాయి శవపేటికను కనుగొన్నట్లు చెప్పారు. కాగా ఈ సమాధి పురాతన కాలంలో తెరవబడిందని ప్రాథమిక అధ్యయనాల్లో తేలినట్లు వాజీరి పేర్కొన్నారు. ఇక రెండోవ సమాధి మాత్రం ఇప్పుడే మొదటిసారి తెరిచినట్లు చెప్పుకొచ్చారు. కాగా కానోపిక్ కుండలను కలిగి ఉన్న రెండు శవపేటికలతో పాటు, సున్నపురాయి శవపేటిక కూడా ఇప్పటివరకు ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నట్లు తెలిపారు. ఒక కుండలో ఫైయన్స్‌తో చేసిన సుమారు 402 ఉషబ్తి బొమ్మలు, చిన్న తాయెత్తులు, ఆకుపచ్చ పూసలు ఉన్నాయని చెప్పారు.