Sri Lanka Crisis: షాకింగ్ నిర్ణయం తీసుకున్న శ్రీలంక.. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు మూసివేత..!

|

Jun 19, 2022 | 5:43 AM

Sri Lanka Crisis: తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్‌ ఆఫీసులు, స్కూళ్లను మూసివేయాలని ఆదేశించింది.

Sri Lanka Crisis: షాకింగ్ నిర్ణయం తీసుకున్న శ్రీలంక.. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు మూసివేత..!
Schools
Follow us on

Sri Lanka Crisis: తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్‌ ఆఫీసులు, స్కూళ్లను మూసివేయాలని ఆదేశించింది. అవును మీరు విన్నది నిజమే.. శ్రీలంకలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు అడుగంటిపోయాయి. ఇప్పుడున్న నిల్వలు మరో రెండు మూడు రోజులే వస్తాయంటోంది శ్రీలంక ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల్ని మూసివేయాలని ఆదేశించింది. అయితే వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల మాత్రం ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. కొలంబో సిటీ పరిధిలోని స్కూల్స్‌ ఆన్‌లైన్‌లో క్లాసెస్‌ నిర్వహించాలని స్పష్టం చేసింది. గంటల కొద్దీ కరెంట్‌ కోతలు అమలవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలల నుంచి శ్రీలంకలో రోజుకి 13 గంటల పాటు కరెంట్‌ ఉండటం లేదు.

ఇక పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంక్‌ల వద్ద గంటలకొద్దీ వెయిట్‌ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో కార్మికులకు ఉపాధి కరువైంది. నాలుగైదు రోజుల్లో పెట్రోల్‌ షిప్‌మెంట్లు వస్తాయని శ్రీలంక ఆశిస్తోంది. అవి వచ్చినా ఓ మూలకు కూడా సరిపోవని టాక్. రెండు కోట్లకు పైబడి జనాభా ఉన్న శ్రీలంక, ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ మారక ద్రవ్యానికి తీవ్ర కొరత ఉండటంతో ఆహార ధాన్యాలు, ఇంధనం, ఔషధాలను దిగుమతి చేసుకోవడానికి శ్రీలంక నానాపాట్లు పడుతోంది. భారత్‌తో పాటు పలు దేశాలను సహాయం చేయాలని అభ్యర్థిస్తోంది. భారత్‌ ఇప్పటికే సాయం చేస్తోంది. మరోవైపు, పరిస్థితులు ఇలాగే కొనసాగితే శ్రీలంకలో మానవ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 10 లక్షల మంది బలహీన వర్గాల ప్రజలను ఆదుకునేందుకు 47 లక్షల డాలర్లు ఇస్తామని చెప్పింది. బెయిల్‌ అవుట్‌ ప్యాకేజ్‌ కోసం IMFతో శ్రీలంక చర్చలు జరుపుతోంది. ఈ నెల 20న IMF ప్రతినిధులు కొలంబో రానున్నారు. ప్రస్తుతం శ్రీలంక విదేశాలకు ఉన్న అప్పు 51 బిలియన్‌ డాలర్లు. లంక సంక్షోభం ఎప్పటికి ముగుస్తుందో మరి!