Dragan warning to Group seven alliance: కరోనా వైరస్‌ను ప్రపంచం మీదికి వదిలి ఏకాకిగా మిగిలిన చైనా ఇపుడు అగ్రరాజ్యం అమెరికా సారథ్యం వహిస్తున్న జీ7 కూటమిపై రంకెలేస్తోంది. చిన్న చిన్న కూటములతో ప్రపంచాన్ని నిర్దేశించలేరంటూ డ్రాగన్ కంట్రీ వార్నింగిచ్చింది. కరోనా వైరస్‌ని ప్రపంచం మీదికి వదలడం ద్వారా యావత్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకంలో పడేసిన చైనాపై జీ7 కూటమి దేశాలు పరోక్ష యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ తాజా హెచ్చరికలు జారీ చేసింది. యుకేలో జరిగిన జీ7 కూటమి సదస్సులో చైనా ఆధిపత్య నియంత్రణపై సమాలోచనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని నేరుగా ప్రస్తావించని చైనా.. చిన్న చిన్న కూటములతో తమను ఏమీ చేయలేరంటూ ధీమా వ్యక్తం చేసింది.
ప్రపంచాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలను కేవలం కొన్ని దేశాలతో ఏర్పాటైన గ్రూపులు శాసించే రోజులు పోయాయని యుకేలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి ఓ ప్రకటన చేశారు. అన్ని ప్రపంచ దేశాలను సంప్రదించిన తర్వాతనే మానవాళిని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. చిన్నా.. పెద్దా.. ధనిక.. పేద దేశాలను తాము సమాన దృష్టితో చూస్తామని రాయబార కార్యాలయ ప్రతినిధి ప్రకటించారు.
అమెరికా, రష్యాలకే దక్కిన ప్రపంచ పెద్దన్న పాత్ర కోసం చిరకాలంగా ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్న చైనా.. నాలుగు దశాబ్ధాలుగా తమ సైనిక, ఆర్థిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. ఈ ధోరణి ఓ వైపు కొనసాగుతుండగా.. కరోనా వైరస్‌ని వూహన్ ల్యాబు ద్వారా ప్రపంచం మీదికి వదిలిన చైనా.. పలు దేశాల్లో కరోనా మరణ మృదంగం మోగిస్తుంటే.. చోద్యం చూస్తోంది. తాము మాత్రం నాలుగు రకాల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసుకుని.. తమ ప్రజలను కరోనా నుంచి రక్షించుకున్నారు చైనా పాలకులు. వ్యాక్సిన్ ఫార్ములాను ఉత్తర కొరియా, పాకిస్తాన్‌లకు తప్ప ఇంకెవరికీ ఇవ్వలేదు చైనా.
చైనా సామ్రాజ్య కాంక్షను గుర్తించిన అమెరికా సహా పలు యూరప్ దేశాలు .. డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. చైనా పెత్తనానికి ముకుతాడు వేసేందుకు తగిన మార్గాల కోసం అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్ దేశాలతో కూడిన కూటమి ప్రయత్నిస్తోంది. చైనా నుంచి పొంచి వున్న సవాళ్ళకు చెక్ పెట్టేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించడంపై జీ7 కూటమి దృష్టి సారించింది. అతి భారీ వ్యయంతో చైనా చేపడుతున్న ప్రాజెక్టులకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు జీ7 దేశాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇందుకోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.