ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు . ఇప్పుడిది తెలివైన వ్యక్తి చేతుల్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అమెరికాను ద్వేషించే ర్యాడికల్ లెఫ్ట్ ఉన్మాదుల నిర్వహణ నుంచి బయటకు వచ్చిందన్నారు. ట్విట్టర్‌ను తీవ్రంగా దెబ్బతీసిన నకిలీ ఖాతాలు, ఇతర సమస్యలను వదిలించుకోవడానికి ట్విటర్ కృషి చేయాలని కోరారు. 2021 జనవరిలో అగ్రరాజ్యంలోని క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి పరిణామాల నేపథ్యంలో.. ట్రంప్‌పై ట్విటర్ శాశ్వతంగా నిషేధం విధించింది. అప్పటి నుంచి ఆయన ట్విట్టర్‌పై కోపంగా ఉన్నారు. అయితే ట్విటర్ కొనుగోలు ప్రక్రియ పూర్తయితే.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తామని ఎలన్ మస్క్ గతంలోనే స్పష్టం చేశారు. మరి ఇప్పుడు ట్రంప్ ఖాతా యాక్టివ్ అవుతుందా లేదా.. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ యూజ్ చేస్తారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు కంటెంట్ మోడరేషన్ విధానాలకు ఇంకా ఎటువంటి మార్పులు చేయలేదని ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ అక్టోబర్ 29వ తేదీ శనివారం స్పష్టం చేశారు. ట్విట్టర్ యొక్క కంటెంట్ మోడరేషన్ ప్రమాణాలు చాలా కఠినంగా ఉన్నాయని, జీవితకాల నిషేధాలపై తనకు నమ్మకం లేదని గతంలో ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు. దీంతో ఎలన్ మస్క్ ట్విట్టర్ వినియోగదారులపై శాశ్వత నిషేధాలను తొలగిస్తారనే ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ అధినేత తాజా వ్యాఖ్యలు చూస్తే మాత్రం ట్విట్టర్ వినియోగంపై నిషేధం ఉన్న వారి ఖాతాలను తిరిగి పునరుద్ధరించే అంశంపై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. దీంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా ట్విట్టర్ ఖాతా బ్లాక్ చేయబడిన మిగతా హై-ప్రొఫైల్ వ్యక్తుల ఖాతాలను వెంటనే తిరిగి పునరుద్దరించకపోవచ్చని తెలుస్తోంది.
To be super clear, we have not yet made any changes to Twitter’s content moderation policies https://t.co/k4guTsXOIu
— Elon Musk (@elonmusk) October 29, 2022
నెలల తరబడి న్యాయపోరాటం చేసిన ఎలన్ మస్క్ ఎట్టకేలకు అక్టోబర్ 27వ తేదీ గురువారం సోషల్ మీడియా నెట్‌వర్క్ ట్విట్టర్ యాజమాన్య హక్కులు దక్కించుకున్నారు. అలాగే ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురు ఉన్నత అధికారులను ఆయా ఉద్యోగ బాధ్యతల నుంచి ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..