
తూర్పు ఆసియా దేశం ఇండోనేషియాను భారీ వర్షాలు, వరదలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. దేశ రాజధానిలో జకార్తాలో కుండపోత వర్షాలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా వరద నీరు నగరంలోని పలు వీధులను ముంచెత్తింది. దాదాపు 17 ప్రధార రహదార్లలో వరద నీరు పోటెత్తడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గంటల పాటు ట్రాఫిక్ జామ్ కొనసాగింది. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లు ముంచేయడంతో జకార్త వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు దాదాపు 270 ఇళ్లలోని ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి కలిబాటాలోని తాత్కాలిక నివాసాలకు తరలించారు. దక్షిణ జకార్తాలోని పాండోక్ లాబులో ఉన్న మదరసా ‘త్సానావియా నెగెరీ’లోకి వరద నీరు చేరింది. వరద నీటి తాకిడికి గోడ కూలిపోవడంతో ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. నడుములోతు నీరు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వీరందరినీ అధికారుల సురక్షితంగా తరచించారు. పాఠశాలలోని కర్చీలు, బల్లలూ తేలుతూ కనిపించాయి.
కాగా జకర్తాలో గత ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇదే తరహాలో వరదలు వచ్చాయి. అప్పట్లో ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు జనవరిలో కురిసిన భారీవర్షాల కారణంగా ఏకంగా 66 మంది మృతి చెందారు. తాజాగా ఇండోనేషియాలోని పసర్ మింగు జిల్లాలో 24 గంటల్లో 178 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సుమత్రా ద్వీపంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది, అచే ప్రావిన్స్‌లోని నార్త్ అచే రీజెన్సీలో 18,160 మంది తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ ద్వీపంలోని 95 గ్రామాల్లో 22 వేలమందిపై వరద ప్రభావం పడింది.
కాగా మరి కొద్ది రోజుల పాటు భారీ వర్షాలుంటాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపడుతున్నా ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..