ఇండోనేసియాలో నౌకలో ఉవ్వెత్తున ఎగసిన మంటలు, లైఫ్ జాకెట్లతో సముద్రంలోకి దూకిన ప్రయాణికులు , అంతా క్షేమం.

| Edited By: Phani CH

May 30, 2021 | 11:49 AM

ఇండోనేసియాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌకను మంటలు చుట్టుముట్టడంతో తమను తాము రక్షించుకునేందుకు వందలాది ప్రయాణికులు మొలుక్కా సముద్రంలోకి దూకారు.

ఇండోనేసియాలో నౌకలో ఉవ్వెత్తున ఎగసిన మంటలు, లైఫ్ జాకెట్లతో సముద్రంలోకి దూకిన ప్రయాణికులు , అంతా క్షేమం.
Indonesia
Follow us on

ఇండోనేసియాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌకను మంటలు చుట్టుముట్టడంతో తమను తాము రక్షించుకునేందుకు వందలాది ప్రయాణికులు మొలుక్కా సముద్రంలోకి దూకారు. నార్త్ మలూకా లోని టెర్నేట్ ప్రావిన్స్ నుంచి సులాబేస్ దీవుల దిశగా వెళ్తున్న ఈ షిప్ కి హఠాత్తుగా నిప్పంటుకుంది. ఇండోనేసియాలోని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ తీసిన వీడియో ఫుటేజీలో ఈ నౌక నుంచి మంటలు రావడం, పొగ దట్టంగా అలముకోవడం స్పష్టంగా కనిపించింది. ప్రయాణికులంతా భయంతో లైఫ్ జాకెట్లు ధరించి నౌక డెక్ భాగం నుంచి సముద్రంలోకి దూకడాన్ని సహాయక బృందం గమనించింది. ఈ నౌకలో 181 మంది ప్యాసెంజర్స్ ,14 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఒకరు గల్లంతయ్యారని,మిగిలినవారిని రక్షించగలిగామని వారు చెప్పారు. 274 మందిని కాపాడగలిగామన్నారు. గల్లంతయిన ఓ వ్యక్తి కోసం ఇంకా గాలిస్తున్నారు. షిప్ ఇంజన్ రూమ్ నుంచి మంటలు మొదలైనట్టు భావిస్తున్నారు. అసలు మంటలు ఎందుకు రేగాయో కారణాలను కనుగొనేందుకు యత్నిస్తున్నారు.

కాగా సహాయక సిబ్బంది అప్రమత్తమై మెషిన్ బోట్లతో ఇంతమంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించడంపట్ల వారిని ఇండోనేసియా ప్రభుత్వం అభినందించింది. ఇదొక సాహస కృత్యమేనని పేర్కొంది. నౌక కెప్టెన్ వెంటనే ఈ అగ్ని ప్రమాదాన్ని గుర్తించి సకాలంలో సమాచారాన్ని సహాయక సిబ్బందికి తెలియజేయడంతో పెను ముప్పు తప్పింది. తాము ఇంత ప్రమాదం నుంచి బయటపడతామని అనుకోలేదని, ఇది తమ అదృష్టమేనని ప్రయాణికుల్లో కొందరు చెప్పారు. మొలుక్కా సముద్రంలో తిమింగలాలు ఎక్కువగా ఉంటాయని వీరిలో కొందరు తెలిపారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: TANA Election Live: అమెరికాలో కొనసాగుతున్న ‘తానా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. మరికొన్ని గంటల్లో ఫలితాలు

Mehul Choksi: మెహుల్ చోక్సీ ‘కొరకరాని కొయ్య’… ఇండియాకు అప్పగించరాదంటూ ఆంటిగ్వా విపక్షనేత డిమాండ్…