Corona: మళ్లీ వచ్చేసింది.. రూపం మార్చుకుని దూసుకొస్తోంది.. ఈసారి కరోనా మరింత డేంజర్‌గా.!

రాను అనుకున్నారా... రాలేను అనుకున్నారా?.. అంటూ కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రూపం మార్చుకుని జెట్‌ స్పీడ్‌తో దూసుకొస్తూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. పాత శత్రువు.. మళ్లీ కొత్త రూపం మార్చుకుని బెంబేలెత్తిస్తోంది. యావత్ ప్రపంచానికి మళ్లీ వణుకు పుట్టిస్తోంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం..

Corona: మళ్లీ వచ్చేసింది.. రూపం మార్చుకుని దూసుకొస్తోంది.. ఈసారి కరోనా మరింత డేంజర్‌గా.!
Covid 19

Updated on: May 19, 2025 | 9:38 AM

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో.. ముఖ్యంగా హాంకాంగ్‌, సింగపూర్‌ లాంటి ఆసియా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని వారాలుగా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా అధికమవుతుండడం కంగారు పెడుతోంది. మరణాలు కూడా పెరుగుతుండడం వణుకు పుట్టిస్తోంది. దాదాపు ఏడాది తర్వాత తొలిసారిగా కేసులు నమోదు అవుతుండడం భయపెడుతోంది. ఆయా దేశాల్లోని పరిస్థితులు అక్కడి ప్రభుత్వాలు ఆరోగ్య సంస్థలు ప్రజలను అలెర్ట్‌ చేస్తున్నాయి. గతంలోని తీసుకున్న వ్యాక్సిన్ల రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గుతుండడం, కొత్త వేరియంట్ల ఎంట్రీతో కరోనా కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే.. కరోనా బూస్టర్‌ డోసులు తీసుకోవాలని, ఫ్లూలాగానే కోవిడ్‌ వ్యాక్సిన్‌ను కూడా పరిగణించాలని సూచిస్తున్నారు. అదేసమయంలో కొన్ని దేశాలు మరోసారి వ్యాక్సిన్స్‌ డెవలెప్‌మెంట్‌పై ఫోకస్‌ పెట్టాయి. ఈ క్రమంలోనే.. పెరుగుతున్న ముప్పు దృష్ట్యా అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నోవావాక్స్‌ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త వ్యాక్సిన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం అమెరికాతోపాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఎల్‌పీ.8.1 వేరియంట్‌ ద్వారా కేసులు పెరుగుతున్నట్లు అమెరికా అంటువ్యాధుల నిపుణులు గుర్తించారు. 70శాతం కేసులకు ఈ వేరియంటే కారణమని.. 9శాతం కేసులకు ఎక్స్‌ఎఫ్‌సీ వేరియంట్‌ కారణమని వెల్లడించారు. మొత్తంగా.. ఆగ్నేయాసియాలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్-19 కొత్త వేరియంట్‌ తర్వాత ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి వినాశనం తప్పదా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.