ఓ వైపు కృత్రిమ మేధ రోజురోజుకు అభివృద్ధి చెందుతుండగా.. మరోవైపు దీనిపై ఆందోళనలకు కూడా నెలకొంటున్నాయి. భవిష్యత్తులో కృత్రిమ మోధ మానవుల నుంచి నియంత్రణ కోల్పోతే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఏఐ గాఢ్‌ఫాదర్ గా పిలుచుకునే జాఫ్రీ హింటన్ కూడా ఇటీవల ఈ రంగం నుంచి రాజీనామ చేయడం ఏఐతో పొంచి ఉన్న ముప్పును నమ్మేలా చేస్తున్నాయి. అయితే ఈ కృత్రిమ మేధ రంగంపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌లను అమెరికా వైట్‌హౌస్ కి పిలిపించారు. ఏఐ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చలు జరిపేందుకు అధ్యక్షుడు జో బైడెన్ సూచన మేరకు వాళ్లిద్దరిని పిలపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రంగంలో ఆవిష్కరణలకు ముందే అవి సురక్షితమైనవనే భరోసా ఇవ్వాలని బైడెన్ ఇటీవల సూచించారు. దీంతో అత్యవసరంగా వారిద్దరినీ పిలిపించారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జెఫ్ జైంట్స్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్, తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చాట్‌జీపీటీ ఓపెన్‌ఏఐ సీఈవో శాం ఆల్ట్‌మన్, ఆంథ్రోపిక్ సీఈవో డేరియో అమోడీలనూ కూడా ఈ సమావేశానికి పిలిపించారు. చాట్‌జీపీటీ లాంటి కృత్రిమ మేధ ఆవిష్కరణలు రాత్రికిరాత్రే ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో వాటి పర్యవసానాలపై ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో ఏం చర్చించుకున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..