Cockroaches released in Court: న్యూయార్క్‌లోని అల్బానీ సిటీ కోర్టులో బొద్దింకలు రచ్చ చేశాయి. దాంతో కోర్టును తాత్కాలికంగా మూసేశారు. అక్కడి న్యాయాధికారులు, ఇతర అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. రాష్ట్ర క్యాపిటల్ వద్ద నలుగురు వ్యక్తుల అరెస్ట్‌కు సంబంధించి అల్బానీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఇంతలో న్యాయస్థానంలో జరుగుతున్న వాదనలను ప్రతివాది వీడియో చిత్రీకరించడం ప్రారంభించారు. దాంతో ఆ వీడియో ఆపమని న్యాయస్థానం అధికారుల సూచించారు. దాంతో వివాదం చెలరేగింది ఈ నేపథ్యంలో కొందరు ప్లాస్టిక్ కవర్లలో వందలాది బొద్దింకలను పట్టుకొచ్చి కోర్టులో వదిలారు. ఆ బొద్దింకలు కోర్టు హాల్ మొత్తం ఆక్రమించేయడంతో అందరూ భయపడిపోయారు. కోర్టు నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, కోర్టు హాల్‌లో తిష్ట వేసిన బొద్దింకలను తరిమేందుకు పొగపెట్టాల్సి ఉంటుందని, అప్పటి వరకు కోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా, ఈ ఘటనకు పాల్పడింది ఒక మహిళ అని నిర్ధారించుకున్నారు అధికారులు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, భౌతిక సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి ఆరోపణల కింద 34 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు.