చంద్రుడిపై చైనా తన జాతీయ జెండాను పాతింది.. అందుకు సంబంధించిన ఫోటోలను డ్రాగన్ దేశం విడుదల చేసింది. అమెరికా తర్వాత చందమామపై జెండాను పాతిన దేశం చైనానే! చాంగే-5 ల్యాండర్‌కు ఉన్న కెమెరా ఈ ఫోటోను తీసింది.. సుమారు 50 ఏళ్ల కిందట అమెరికా తమ జాతీయ జెండాను జాబిల్లిపై పాతింది.. మళ్లీ ఇంత కాలానికి చైనా ఆ పని చేసింది.. చంద్రుడి ఉపరితంపై నమూనాలను సేకరించడానికి వెళ్లిన చైనా స్పేస్ షిప్ అక్కడ తమ జాతీయ జెండాను అమర్చింది.. ఎగరేయడానికి, జెండాను రెపరెపలాడించడానికి అక్కడ గాలి ఉండదు కాబట్టి నిశ్చలంగా ఉన్న జెండాను చూసి మురిసిపోయింది చైనా.. రెండు మీటర్ల వెడల్పు, 90 సెంటిమీటర్ల పొడవు ఉన్న ఈ జెండా ఫోటోలను చైనా జాతీయ అంతరిక్ష కేంద్రం విడుదల చేసింది. చంద్రుడి మట్టిని సేకరించి తిరిగి భూమ్మీదకు బయలుదేరే ముందు చాంగే-5 చైనా జెండాను చంద్రుడి ఉపరితలంపై పాతింది. చంద్రుడు నుంచి ఇప్పటికే అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలు మట్టిని తీసుకొచ్చాయి.. ఇప్పుడా వరుసలో చైనా నిలిచింది. చంద్రుడి మీదకు మనుషులను పంపాలనుకుంటున్న చైనా 2030 నాటికి అంగారక గ్రహం నుంచి కూడా మట్టిని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది.