మారుతున్న వాతావరణ పరిస్థితులతో ప్రపంచంలో అనేక దేశాలు ప్రకృతి వైపరీత్యాలతో విలవిలాడుతున్నాయి. మన పొరుగుదేశమైన చైనాలో కూడా భిన్నమైన వాతావరణం నెలకొంది. డ్రాగన్ కంట్రీలో కొన్ని రోజుల క్రితం వరకూ విపరీతమైన ఎండ వేడి వడగాల్పులతో ఇబ్బంది పడగా ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. మరికొన్ని చోట్ల తీవ్రమైన ఎండలకు వందలాది జంతువులు మృత్యువాత పడ్డాయి. వర్షాలు, వరదల కారణంగా చైనా వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లు ఎదురవుతూ ఉండడంతో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.
విభిన్నమైన వాతావరణం గోధుమ పంటను నాశనం చేసింది. మత్స్యసంపద కూడా ప్రమాదంలో పడింది. గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని వరి పొలాల్లో పంట ఎండిపోగా.. విపరీతమైన వేడికి చేపలు చనిపోయాయి. నాన్‌టాంగ్ నగరంలో వందలాది పందులు హీట్‌స్ట్రోక్‌తో మృత్యువాత పడ్డాయి. మరోవైపు, విపరీతమైన వేడి, భారీ వర్షాలు, వరదల కారణంగా గోధుమ పంటకు నష్టం వాటిల్లుతుందని జిన్‌జియాంగ్ నగరంలో అధికారులు హెచ్చరించారు.
వేల ఎకరాల్లో దెబ్బ తిన్న పంటలు
సెంట్రల్ చైనాలో మే నెలలో కురవాల్సిన వర్షాలు ఆలస్యంగా కురిశాయి. ఈ ప్రభావం వేలాది ఎకరాల పంటలపై పడింది. గోధుమ గింజలు నల్లగా మారాయి. పంటలను రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. అత్యవసర బృందాలను నియమించింది. అయితే ఆహార సరఫరాలో చైనా స్వయం సమృద్ధిని పెంచాలని అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కోరారు.
గోధుమ పంటకు భారీ నష్టం
గత దశాబ్ద కాలంలో గోధుమ పంటకు ఇది అతిపెద్ద దెబ్బ అని స్థానిక అధికారులు తెలిపారు. గత వేసవిలో జిన్‌పింగ్ ప్రభుత్వం పంది మాంసాన్ని, పండ్లు, కూరగాయలను వ్యూహాత్మకంగా నిల్వ చేసింది. అనంతరం పండ్లు, కూరగాయలు, పందుల ధరలు పెరిగిన తర్వాత వాటిని స్థిరీకరించింది. దీంతో ఆహార భద్రత ప్రాధాన్యతను అధికారులు పునరుద్ఘాటించారు. కరోనా మహమ్మారి సమయంలో షాంఘైలో ఆహారం భద్రతను కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సమయంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు నిల్వ చేసిన ఆహారాన్ని ప్రజలకు అందించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..