మరోసారి కెనడాలో కోవిడ్ అంక్షలు అమలు.. క్రూయిజ్ నౌకలపై మరో ఏడాది పాటు నిషేధం
మరోసారి కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వైరస్ నుంచి దేశ ప్రజలను కాపాడుకునేందుకు అయా దేశాలు మరోసారి అంక్షలు కఠినతరం చేస్తున్నాయి
Cruise Ship Ban in Canada : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతూనే ఉంది. దీంతో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. వైరస్ నుంచి దేశ ప్రజలను కాపాడుకునేందుకు అయా దేశాలు మరోసారి అంక్షలు కఠినతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా క్రూయిజ్ నౌకలపై 2022 ఫిబ్రవరి వరకు నిషేధం విధిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. 100 మందికి పైగా ప్రయాణించే నౌకలకు ఈ నిషేధం వర్తిస్తుందని కెనడా రవాణ శాఖ మంత్రి ఒమర్ అల్గాబ్రా చెప్పారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి క్రూయిజ్ నౌకల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు మంత్రి ఒమర్ స్పష్టం చేశారు. మరోవైపు, ఉత్తరఅమెరికాలో కరోనా మహమ్మారి వల్ల గత ఏడాది ఏప్రిల్ క్రూయిజ్ నౌకల సంచారంపై నిషేధం విధించారు.
క్రూయిజ్ నౌకల పర్యాటక పరిశ్రమ కరోనా వల్ల తీవ్ర సంక్షోభంలో మునిగింది. కెనడియన్ ఓడరేవు నగరాలైన వాంకోవర్, క్యూబెక్, మాంట్రియల్‌ల నుంచి క్రూయిజ్ నౌకలు నడుస్తుంటాయి. కరోనా విజృంభణ కారణంగా క్రూయిజ్ నౌకలపై నిషేధం విధించడంతో ఆర్థికంగా భారీగా దెబ్బపడింది. 2019లో కెనడాకు 12 దేశాల నుంచి క్రూయిజ్ నౌకలు ప్రయాణం సాగిస్తుండగా, వీటిలో 2 మిలియన్ల మంది పర్యాటకులను చేరవస్తున్నట్లు కెనడా మంత్రిత్వశాఖ తెలిపింది. ఇదిలావుంటే, కెనడాలో ఇప్పటి వరకు 8 లక్షల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 20,500 మంది మృత్యువాతపడినట్లు కెనడా అధికారులు వెల్లడించారు.