ఏళ్లుగా పోలీసులకు చిక్కలేదు.. వేషం మార్చిన రోజే దొరికిపోయాడు!
బ్రెజిల్‌లో వరుస హత్యల కేసులో 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలల వ్యవధిలో 16 మందిని హత్య చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అడవిలో దాక్కునేవాడు. బ్రెజిల్ పరైబాలోని మారుమూల ప్రాంతం ములుంగులో ఈ వరుస హత్యలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని జోర్లాన్ లోపెస్ డా సిల్వాగా పోలీసులు గుర్తించారు.

స్థానికులు జోర్లాన్‌ను ‘మస్కిటో’ (దోమ) అని పిలిచేవారు. సన్నగా, బలహీనంగా కనిపించే శరీరాకృతి కారణంగా ఈ పేరు వచ్చింది. జోర్లాన్ సాధారణంగా జనావాసాలకు దూరంగా అడవిలో తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసుకుని అక్కడ దాక్కునేవాడు. దీంతో అతడిని గుర్తించడం, గత నేరాలతో అతడికి సంబంధాన్ని నిర్ధారించడం పోలీసులకు కష్టమైంది,
ఒక హత్యతో బయటపడిన లింక్
ములుంగు ప్రాంతంలో జరిగిన పలు హత్యలు మొదట ఒకదానితో మరొకటి సంబంధం లేనివిగా కనిపించాయి. అయితే ఓ బహిరంగ ప్రదేశంలో 18 ఏళ్ల యువకుడిని జోర్లాన్ కాల్చి చంపిన ఘటన తర్వాత పోలీసులు కేసులను మరోసారి పరిశీలించారు. దర్యాప్తులో గతంలో జరిగిన హత్యలకు జోర్లాన్‌కు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. మూడు నెలల్లో మొత్తం 16 మంది ప్రాణాలు తీసినట్లు జోర్లాన్‌పై అభియోగాలు మోపారు. తాను నేరస్థులనే లక్ష్యంగా చేసుకున్నానని జోర్లాన్ చెప్పినా ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు అతడి వాదనతో సరిపోలడం లేదని పోలీసులు అన్నారు. అంతేకాదు.. పోలీసులు గుర్తించిన నేరాల కంటే ఇంకా ఎక్కువ నేరాలకు సంబంధించిన ఆధారాలను జోర్లాన్ అందించాడు. అయితే కొన్ని కేసుల్లో దర్యాప్తు కొనసాగుతుండటంతో బాధితుల వివరాలు, వారు ఎలా చనిపోయారన్న విషయాలను పోలీసులు వెల్లడించలేదు
తప్పించుకునే ప్రయత్నంలో విచిత్రమైన వేషం
జోర్లాన్‌ను అరెస్ట్ చేసిన సమయంలో అతడు నలుపు తెలుపు చారలు ఉన్న డ్రెస్, విగ్, రంగు వేసిన గోళ్లతో కనిపించాడు. అతడి చేతుల్లో ఓ పసికందు ఉంది. ఆ బిడ్డకు జోర్లాన్‌కు ఎలాంటి సంబంధం లేదని అధికారులు నిర్ధారించారు. అయితే ఆ చిన్నారిని అతడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అడవిలో తన తాత్కాలిక శిబిరానికి చేరుకోలేని పరిస్థితి ఎదురుకావడంతో జోర్లాన్ తప్పించుకునేందుకు ఆడ వేషం వేసుకున్నా చివరికి పోలీసులకు చిక్కాడు.
13 ఏళ్ల వయసులో తొలి హత్య
జోర్లాన్ వ్యక్తిత్వం భిన్నమైందని 13 ఏళ్లు వయసులో మొదటి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడనీ పోలీసు అధికారి డగ్లస్ గార్సియా తెలిపారు. జోర్లాన్ ఒక క్రిమినల్ గ్యాంగ్‌లో సభ్యుడని ఆ గ్యాంగ్ ఈ ప్రాంతంలో పలువురిని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే జోర్లాన్ మాత్రం స్థానిక క్రిమినల్ గ్యాంగ్‌లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఖండించాడట. తాను **‘వ్యక్తిగతంగా యుద్ధం’* చేస్తున్నానని పోలీసులకు చెప్పినట్లు అధికారులు తెలిపారు. ములుంగు ప్రాంతం బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరానికి సుమారు 2,500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం జోర్లాన్‌పై నమోదైన కేసుల పై దర్యాప్తు కొనసాగుతోంది. అతడు వెల్లడిస్తున్న అదనపు సమాచారంతో మరిన్ని నేరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి