Modi Brazil Award: ప్రధాని మోదీకి బ్రెజిల్‌ అత్యున్నత పురస్కారం… 140 కోట్ల భారతీయులకు గర్వకారణమన్న మోదీ

బ్రెజిల్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి మరో గౌరవం లభించింది. బ్రెజిల్‌ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్‌ కాలర్‌ ఆఫ్‌ ది నేషనల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది సదర్న్‌ క్రాస్‌’ లభించింది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ కృషి, కీలకమైన ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకు...

Modi Brazil Award: ప్రధాని మోదీకి బ్రెజిల్‌ అత్యున్నత పురస్కారం...  140 కోట్ల భారతీయులకు గర్వకారణమన్న మోదీ
Modi Brazil Award

Updated on: Jul 09, 2025 | 6:55 AM

బ్రెజిల్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి మరో గౌరవం లభించింది. బ్రెజిల్‌ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్‌ కాలర్‌ ఆఫ్‌ ది నేషనల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది సదర్న్‌ క్రాస్‌’ లభించింది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ కృషి, కీలకమైన ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకు గానూ బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా.. ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలను మోదీ అందుకోవడం ఇది 26వ సారి. ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా 140 కోట్లమంది భారతీయులకూ గర్వకారణమన్నారు ప్రధాని మోదీ.

అర్జెంటీనాకు వెళ్లడానికి ముందు- ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలో ప్రధాని మోదీ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో అత్యున్నత పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. “ది ఆర్డర్‌ ఆఫ్ ది రిపబ్లిక్‌ ఆఫ్ ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో” పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ మోదీనే కావడం విశేషం.140 కోట్ల భారతీయు తరపున ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నా అని మోదీ చెప్పారు.

ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టైన్‌ కార్లా కంగాలో చేతుల మీదుగా పురస్కారాన్ని ప్రదానం చేశారు. దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందజేసినందుకు ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రజలకు, ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం ఇరుదేశాల మధ్య శాశ్వత స్నేహ సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని మోదీ అన్నారు. 180 ఏళ్ల క్రితం నుంచి భారత్‌, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయని, ఇక్కడ స్థిరపడిన భారతీయులే అందుకు నిదర్శనమని చెప్పారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అంకితభావంతో కృషి చేస్తానని చెప్పారు. ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ నేత మోదీయేనని భారత విదేశాంగశాఖ వెల్లడించింది.

ఇటీవలె పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనా అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా ఘనా వెళ్లిన ప్రధాని మోదీని ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డుతో సత్కరించారు. రాజధాని ఆక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమానీ మోదీకి ఈ అవార్డును మోదీకి అందజేశారు.

జులై 2న ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనకు బయలుదేరారు. జులై 9 వరకు ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఘనా, ట్రినిడాడ్ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్‌ పర్యటనలను పూర్తిచేసుకున్న ప్రధాని మోదీ నమీబియాలో అడుగుపెట్టనున్నారు. దీంతో గడిచిన మూడు దశాబ్దాల్లో ఈ దేశంలో పర్యటించే తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం విశేషం.