Bhutan First Corona Death: హిమాలయ ప్రాంతమైన భూటాన్‌లో తొలి కరోనా మరణం సంభవించింది. ఈ విషయాన్ని భూటాన్ ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. రాజధాని థింపులో 34 ఏళ్లు ఉన్నవ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందాడు. ఇదివరకే కాలేయ వ్యాధితో బాధపడుతున్న అతనికి కోవిడ్ సోకడంతో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు ఏడున్నర లక్షల జనాభా ఉన్న భూటాన్‌లో ఇప్పటి వరకు 767 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.
మర్చి నెలలో అమెరికా నుంచి వచ్చిన పర్యాటకులలో ఒకరికి కోవిడ్ ఉన్నట్లు గుర్తించారు. ఇదే ఇక్కడి తొలి కరోనా కేసు. కరోనా కట్టడిలో భాగంగా అక్కడ రెండు సార్లు లాక్‌డౌన్ విధించారు. ముందస్తు చర్యలతో విదేశీ పర్యాటకులపై ఆంక్షలు విధించారు. విదేశాల నుంచి వచ్చేవారిని తప్పనిసరిగా క్వారంటైన్ ఉంచుతున్నారు. ఇప్పటి వరకు భూటాన్‌లో 3 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి రోజు పదికి పైగా పాజటివ్ కేసులు బయటపడుతున్నాయి.
కాగా, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల మందికి కరోనా వ్యాప్తి చెందింది. వీరిలో 19 లక్షల మంది మరణించినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఇక భారత్‌లోనూ కోటి మందికి కరోనా సోకగా, లక్షా 50 వేల మంది వరకు మరణించారు. చైనాలో కరోనా వైరస్ బయటపడినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 210 దేశాలకు వ్యాపించింది. అయితే ఇప్పటి వరకు కరోనా మరణాలు నమోదు కాని దేశాల్లో కాంబోడియా, గ్రెనాడా, డొమినికా, లావోస్ వంటి చిన్న ప్రాంతాలుండగా, ఈ జాబితాలో ఇప్పటి వరకు భూటాన్ నిలువగా, తాజాగా అక్కడ తొలి కరోనా మరణం సంభవించింది.