కరోనా పుట్టినిల్లులో మరోసారి మెల్లమెల్లగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా చైనా రాజధాని బీజింగ్ లో ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు డెలివరీ చేసిన ఫ్యామిలీలను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు.
బీజింగ్ లో 47 ఏళ్ల వ్యక్తి ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇదేక్రమంలో జూన్ 1నుంచి 17వతేదీ మధ్య కాలంలో డాక్సింగ్, ఫంగ్ షాన్, డాంగ్ చెంగ్, ఫెంగటయ్ అనే ప్రాంతాల్లో రోజుకు 50 మందికి చొప్పున ఫుడ్ డెలివరీ చేశాడు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని వైద్యులు పరీక్షించి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. దీంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు. ఫుడ్ డెలివరీ సమయంలో అతడు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడన్న దానిపై స్థానిక అధికారులు సర్వే చేస్తున్నారు. ఇప్పటికే కొందరిని హోం క్వారంటైన్ చేశారు. అయితే కొత్తగా 29 మందికి కరోనా వైరస్ సోకిందని ఆ దేశ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ఫుడ్ డెలివరీ మ్యాన్ వల్లే కరోనా వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇందులో ఏడుగురికి ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా 249 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. చైనాలో మళ్లీ కరోనా వైరస్ ప్రబలుతుండటంతో మరోసారి కరోనా పరీక్షలు చేయాలని బీజింగ్ మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు