పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం ప్రయత్నానికి నిరసనగా ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పాకిస్తాన్ ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషించే ఆర్మీకి వ్యతిరేక నిరసనలు పాక్ లో పెరిగాయి. వందలాది మంది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెషావర్‌లోని ఆర్మీ కార్ప్స్ కమాండర్ నివాసాన్ని ముట్టడించారు, అయితే దేశంలోని శక్తివంతమైన మిలిటరీ అధికారానికి చిహ్నంగా ఉన్న ఆర్మీ ట్యాంక్‌ను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిరసనలను ఉక్కుపాదంతో అణచివేసే పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేక గళాన్ని అక్కడి ప్రజలు వినిపిస్తుండటం పాకిస్తాన్ లాంటి దేశంలో ఆశ్చర్యకరమైనవే.
ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ ఘటనలో తన పార్టీ కార్యకర్త మరణానికి అక్కడి సైన్యాన్ని బాధ్యులను చేశాడు. ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. అలాగే ఈ దాడికి ప్రధాన కారణం పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అంటూ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ పై దాడి తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు దేశంలోని వివిధ ప్రాంతాలలో రోడ్లపైకి వచ్చి సైన్యానికి వ్యతిరేక గళం వినిపించారు. చాలా మంది ఈ దాడిని ఖండించారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయా అనే అనుమానాలను కలిగిస్తున్నాయి.
వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ బలాన్ని తగ్గించడానికి, ఆయనను రాజకీయాల నుంచి బలహీనపర్చడానికి వజీరాబాద్‌లో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ కాల్పుల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఈ దాడి ద్వారా ఇమ్రాన్ ఖాన్ చేతికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఆయుధాలు దొరికినట్లైంది. ఈ దాడి ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఇమ్రాన్ ఖాన్ పోరాడటానికి అవకాశం లభించింది.
ఇమ్రాన్ ఖాన్ పై దాడి వెనుక ఉన్న ప్లాన్ ఒకటైతే.. దాడి తర్వాత ఆ ప్లాన్ బెడిసికొట్టినట్లైంది. ఇమ్రాన్ ఖాన్ ప్రజాదరణను, పలుకుబడిని పెంచడానికి ఈ ఘటన కారణమైందనే అభిప్రాయం ఉంది. దేశంలో ముందస్తు ఎన్నికల కోసం ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ మరింత గట్టిగా వినిపించడానికి ఈ ఘటన దోహదపడుతుందనే చెప్పాలి. పాకిస్తాన్ సైన్యం మాత్రం ఈ దాడికి తమకు సంబంధంలేదనే వాదనను వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రజలపై సైన్యం పట్టు సడలించడం, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా వీధుల్లోకి రావడం పాకిస్తాన్ రాజకీయాల్లో మార్పులకు సంకేతాలుగా తెలుస్తోంది.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో పరిస్థితి హింసాత్మకంగా మారిన నేపథ్యంలో, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో కొనసాగుతున్న ‘లాంగ్ మార్చ్’పై అనిశ్చితి నెలకొంది. ఈ యాత్ర నవంబర్ 11వ తేదీన ఇస్లామాబాద్ చేరుకోనుంది. ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ లో ఘర్షణలు చెలరేగితే సైన్యం కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. ముందస్తు ఎన్నికల కోసం ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ ను నిరాకరిస్తే నిరసనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఒక వేళ అదే జరిగితే పాకిస్తాన్‌లో యుద్ధ వాతావరణం నెలకొంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..