Myanmar in deadliest: మయన్మార్ వీధులు రక్తమోడాయి. ఆ దేశ మిలటరీ తూటాలకు రక్తం ఏరులైపారింది. వంద మందికి పైగా పిట్టల్లా రాలిపోయారు. ఈ ఘటనను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది. సైనిక దళాలు సృష్టించిన మారణహోమాన్ని భయానక చర్యగా అభివర్ణించింది.
మయన్మార్ మిలటరీ ఒకవైపు సాయుధ బలగాల దినోత్సవాన్ని జరుపుకుంటూనే నిరసనకారులపై తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. మిలటరీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న వారిపై తుపాకీగుళ్ల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో శనివారం 114 మందిపైగా మిలటరీ తూటాలకు బలైనట్టుగా మయన్మార్‌లో స్వతంత్ర అధ్యయన సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి 1న మయన్మార్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంది సైన్యం. మిలటరీ చర్యకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది.
ఆ దేశ సైన్యాధికారులు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ఇందులో భాగంగా యాంగాన్, మాండాలే సహా 12 పట్టణాల్లో నిరసనకారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మండాలేలో జరిగిన కాల్పుల్లో అయిదేళ్ల బాలుడు మరణించడంతో విషాదం నెలకొంది. మయన్మార్ సైనికులు తమని అణగదొక్కాలని చూస్తున్నప్పటికీ వారు గద్దె దిగేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిరసనకారులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మిలటరీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. కాగా, ఇప్పటివరకు జరిగిన ఆందోళనల్లో మిలటరీ చర్యలకు మొత్తంగా 400 మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు.
ఒకే రోజు ఈ స్థాయిలో అమాయకులు బలైపోవడంతో అంతర్జాతీయంగా మయన్మార్ మిలటరీపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘సాయుధ బలగాలు ఇవాళ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు’’ అని మిలటరీకి వ్యతిరేకంగా అధికారాన్ని కోల్పోయిన ప్రజాప్రతినిధుల కూటమి అధికార ప్రతినిధి డాక్టర్ శస అన్నారు. సాయుధబలగాల దినోత్సవం బీభత్సంగా జరిగింది. ఇలాంటి చర్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదు అని మయన్మార్‌లో యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల బృందం మండిపడింది.
మయన్మార్ ఆందోళనకారులపై జరిగిన కాల్పులను అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. సైన్యం సృష్టించిన రక్తపాతాన్ని భయానక చర్యగా అభివర్ణించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ ట్విట్టర్ వేదికగా తన నిరసన తెలిపారు. కొంత మంది కోసం మిలటరీ వ్యవహారిస్తుందని, దీన్ని బర్మా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
We are horrified by the bloodshed perpetrated by Burmese security forces, showing that the junta will sacrifice the lives of the people to serve the few. I send my deepest condolences to the victims’ families. The courageous people of Burma reject the military’s reign of terror.
— Secretary Antony Blinken (@SecBlinken) March 27, 2021
మరోవైపు మిలటరీ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హాలింగ్ ప్రజల పరిరక్షణ కోసమే తామున్నామని అన్నారు. త్వరలోనే స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తామని చెప్పారు.
Read Also… ఇండోనేసియాలోని చర్చిని టార్గెట్ చేసిన సూసైడ్ బాంబర్లు, అనేకమందికి గాయాలు